తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కేసీఆర్ కొనసాగుతున్నారు. ప్రజాస్వామ్యం ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పటికీ కూడా ప్రభుత్వ , పార్టీ వ్యవహారాలన్ని కూడా కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతుంటాయి. ఇది జగమెరిగిన సత్యం. ఇక త్వరలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్ తన సింహాసనంను కేటీఆర్ చేతుల్లో పెట్టబోతున్నారని గతకొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి.
కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా వారసత్వ పగ్గాలు అప్పగించేందుకు ముహూర్తం వెతుకున్నట్లుగా చాలా రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు సాగినంత కాలం ఆ పర్వం ముగియగానే కేటీఆర్ కు పట్టాభిషేకం అనే పుకార్లు వినిపించాయి.
అయితే తాజాగా ఒక గులాబీ ఎమ్మెల్యే డెడ్ లైన్ తో సహా జోస్యం చెప్పారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ .. తెలంగాణ ప్రజలు గత కొద్ది రోజులుగా వింటున్న ఓ వార్తను గట్టిగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి నెలలోగా కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు.
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తన నియోజకవర్గంలో కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మునిసిపాలిటీకి మంజూరైన ట్రాక్టర్లను ఆయన ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా.. నియోజకవర్గానికి సంబంధించి.. తాను ముందు ముందు ఏం అభివృద్ధి పనులు చేయబోతున్నానో ఏకరవు పెడుతూ.. వాటికోసం మంత్రి కేటీఆర్ ను ఆల్రెడీ కలిసి విన్నవించిన సంగతిని ప్రజలకు నివేదించారు. ఈ క్రమంలోనే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని, వచ్చే ఏడాది మార్చిలోగా ఆయన ముఖ్యమంత్రి అవుతారని కూడా రెడ్యనాయక్ చెప్పుకొచ్చారు.