వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 15 సీట్లే.. కేసీఆర్ చెల్లని రూపాయి అంటూ?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు సమాధానంగా వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కేవలం 15 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చి చెప్పారు. టీఆర్‌ఎస్‌కు 90 సీట్లు రావడం జరిగే ఛాన్స్ లేదని ఆయన చెప్పుకొచ్చారు. లోక్ సభ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఉండదని ఆయన పేర్కొన్నారు.

లోక్ సభ ఎన్నికలలో ఎంఐఎం సీటు కూడా తాము కైవసం చేసుకుంటామని బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్ బొమ్మతో గెలవడం కష్టమని భావిస్తున్నారని కేసీఆర్ ప్రస్తుతం చెల్లని రూపాయి అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రీజన్ వల్లే కేసీఆర్ ప్రస్తుతం ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదని బండి సంజయ్ కామెంట్లు చేశారు.

కేసీఆర్ ఉపఎన్నిక రావాలని కోరుకుంటున్నారని ఉపఎన్నిక వస్తే ప్రజల దృష్టి ఉపఎన్నిక వైపుకు వెళుతుందని ఆయన భావన అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ మాత్రం ఉపఎన్నిక జరగకూడదని కోరుకుంటోందని బండి సంజయ్ అన్నారు. ప్రజల అభీష్టం ప్రకారం బీజేపీ ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు. క్యాసినో వ్యవహారం బయటపడిన తర్వాత టీఆర్‌ఎస్‌ నేతలు భయపడుతున్నారని చీకటి దందాలకు టీఆర్‌ఎస్‌ కేరాఫ్ అడ్రస్ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.

పార్టీ పార్లమెంటరీ బోర్డు ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయాలను నిర్ణయిస్తుందని కాళేశ్వరం ప్రాజెక్ట్ మునిగిపోవడానికి కేసీఆర్ కారణమని ఆయన చెప్పుకొచ్చారు. కేటీఆర్ మంచిగానే ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. మజ్లిస్ ను భరించే ఓపిక లేదని ముస్లింలు చెబుతున్నారని ఆయన కామెంట్లు చేశారు. బీజేపీకి భయపడి కేసీఆర్ ప్రతి నెలా ఆలస్యంగానైనా జీతాలు ఇస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.