నిజామాబాద్ లో దారుణ ఘటన… 80 కుటుంబాలను ఊరి నుంచి బహిష్కరించిన గ్రామ పెద్దలు..?

పూర్వకాలంలో తప్పు చేసిన వ్యక్తిని అతని కుటుంబాన్ని ఊరి నుండి బహిష్కరించేవారు. అయితే ఇప్పటికి అటువంటి సాంప్రదాయం కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామం నుండి దాదాపు 80 కుటుంబాలను గ్రామ పెద్దలు బహిష్కరించిన ఘటన కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి జరిమానా కట్టకపోవడంతో తలెత్తిన వివాదం వల్ల గ్రామ పెద్దలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే….షాపూర్ గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ గ్రామంలో ఒక స్థలం కొనుగోలు చేసి ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకుంది. అయితే ఆమె ఇంటి స్థలం గ్రామ పంచాయతీదంటూ గ్రామ అభివృద్ధి కమిటీ ఆరోపిస్తు ఆమె కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసింది. దీంతో గ్రామస్తులు అందరూ ఆమె కుటుంబంతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని గ్రామస్తులకు హెచ్చరించారు. అయితే అదే గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఉపయోగంలో లేని తన కరెంటు మీటరును సుజాతకు అమ్మటంతో అసలు వివాదం మొదలైంది. బహిష్కరించిన కుటుంబానికి తన మీటర్ అమ్మడంతో గ్రామ పెద్దలు గంగాధర్ కి రూ.1.20 లక్షల జరిమానా విధించిoది. ఈ ఒప్పందంలో జరిమానా చెల్లిస్తే మీటర్ తిరిగి ఇస్తామని చెప్పారు. ఈ ఒప్పందం జరిగినప్పుడు గల్ఫ్ లో ఉన్నారు గంగాధర్.

అయితే ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చిన గంగాధర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అగ్రహించి మున్నూరుకాపు సామాజిక వర్గం అయిన 80 కుటుంబాలను బహిష్కరిస్తూ గ్రామ పెద్దలు తీర్పునిచ్చారు. 80 కుటుంబాలకు చెందిన వ్యక్తులతో గ్రామస్తులు ఎవరు ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని.. కనీసం వారి పిల్లల్ని కూడా ఆటోలో ఎక్కించుకొని స్కూలుకు తీసుకువెళ్లకూడదని, వారి భూములను కౌలుకు తీసుకోవడం లేదా వారికి కౌలుకు ఇవ్వటం కూడా చేయకూడదని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో బహిష్కరణకు గురైన బాధితులందరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆర్డీఓ, పోలీసుల అధ్వర్యంలో గ్రామ పెద్దలలోవిచారణ జరుపుతున్నారు.