నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభించిన అమిత్ షా..!

నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల కలలకు ఊరటనిచ్చే విధంగా పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యాలయాన్ని ప్రారంభించి పసుపు రైతులకు కల్పించారు. కార్యక్రమంలో పసుపు ఉత్పత్తుల ప్రదర్శనను కూడా అమిత్ షా స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్‌ పసుపు పంటకు కేంద్రం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. నిజామాబాద్‌ను దేశంలోని పసుపు పంటకు రాజధానిగా మార్చడంలో ఇక్కడి రైతుల కృషి అమోఘమని, ఇప్పుడు ఈ బోర్డు ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నిజామాబాద్ పసుపు పేరు వెలుగొందుతుందని వెల్లడించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా దేశంలోని అన్ని పసుపు రైతులకు తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

పసుపు రైతులు అతి త్వరలో గ్లోబల్ మార్కెట్‌లో నేరుగా తమ ఉత్పత్తులను అందించే స్థితికి చేరతారని, బోర్డు ద్వారా ఎగుమతులు మరింతగా పెరుగుతాయని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.. రైతులు మెరుగైన ధరలు పొందడానికి కేంద్రం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని చెప్పారు. తెలంగాణ పసుపు రైతుల కష్టానికి తగిన ఫలితం అందేలా కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ గుప్తతో పాటు పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ నుంచి పసుపు సువాసన అంతర్జాతీయం అవుతుందన్న నమ్మకం ఇప్పుడు స్థానిక రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.