దిల్ రాజు రాజకీయ ఆకాంక్ష… ఎంపీ అంటూ కీలక వ్యాఖ్యలు!

సినిమాలకూ రాజకీయాలకూ ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి రాజ్యాలేలినవారు కూడా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా దిల్ రాజు రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ గా తన ఆసక్తిని బయటపెట్టారు.

అవును… ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడితే తప్పకుండా ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. దీంతో గతకొంతకాలంగా దిల్ రాజు రాజకీయ రంగప్రవేశంపై జరుగుతున్న చర్చకు బలం చేకూరినట్లయ్యింది.

తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతానికి చెందిన దిల్ రాజు.. చాలా ఏళ్లుగా టాలీవుడ్‌ లో వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూషన్‌ తో మొదలు పెట్టిన ఆయన సినిమా కెరీర్… విజయవంతమైన నిర్మాతగా, ఎగ్జిబిటర్‌ గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో రాజకీయంగా అధికార బీఆరెస్స్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి.

అయినప్పటికీ ఆయన ఏనాడూ దిల్ రాజు తన రాజకీయ ఆకాంక్షలను బయట పెట్టలేదు. అయితే తాజాగా తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీ.ఎఫ్‌.సీ.సీ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా దిల్ రాజు బరిలోకి దిగారు. ఈ సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్‌ తో కలిసి తన ప్యానల్ సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగానె రాజకీయాలపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తాను ఏ పార్టీ నుంచి పోటీచేసినా ఎంపీగా గెలుస్తానని చెప్పుకొచ్చారు. అయితే తన మొదటి ప్రాధాన్యత మాత్రం సినిమా రంగానికే ఉంటుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇప్పట్లో సినీ పరిశ్రమను వదిలి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని దిల్ రాజు స్పష్టం చేశారు.