తెలంగాణలో ఎన్నికల పోరు ముగిసినా ఫలితాల పై మాత్రం అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఎవరికి వారే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాజ్యాంగేతర కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా గవర్నర్ ను ముందుగానే అప్రమత్తం చేయాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. మజ్లిస్ తో పొత్తు లేకుంటే టిఆర్ఎస్ కు బిజెపి మద్దతు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో కూటమి పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యంతోనే గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఏ పక్షానికి కూడా మెజార్టీ రాని అవకాశం ఉంది. ఒక వేళ హంగ్ వస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. మెజార్టీ సీట్ల కోసం రాజకీయ పార్టీలు ఏ పరిస్థితికైనా వెనుకడుగు వేసే అవకాశం ఉండదు. హంగ్ వస్తే గవర్నర్ నిర్ణయమే కీలక పాత్ర పోషించనుంది. తెలంగాణలో టిఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు ఒక్కటైన కాంగ్రెస్, టిజెఎస్, టిడిపి, సిపిఐ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మహాకూటమిలోని అన్ని పార్టీలు పోలింగ్ కంటే ముందే అలయెన్స్ పెట్టుకున్నాయి కాబట్టి కూటమిని ఫ్రంట్ గా గుర్తించాలని గవర్నర్ కు వారు విజ్ఞప్తి చేయనున్నారు.
ఉత్తరాఖండ్ లో ఏర్పటిన పరిస్థితుల దృష్ట్యా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమినే అతి పెద్ద పార్టీగా పరిగణించాల్సి ఉంటుందని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా కూటమి నేతలు ఆదివారం సమావేశమై హంగ్ వస్తే ఏర్పడే పరిస్థితుల పై చర్చించారు.
తెలంగాణలో ఎన్నికల తర్వాత వచ్చిన అంచనా ప్రకారం ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. దీంతో నేతలు ఎవరికి వారు తమతమ వ్యూహాలను రచించడంలో నిమగ్నమయ్యారు. హంగ్ వస్తే ఎలా ముందుకు వెళ్లాలి. ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకోవాల్సిన పరిస్థితుల పై నేతలు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 60. కానీ ఈ ఎన్నికలలో ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ స్థానాలు గెలుచుకునే అవకాశం లేదు. మజ్లిస్ ఇప్పటికే టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. మజ్లిస్ తో పొత్తు లేకుంటే తాము టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు బిజెపి ప్రకటించింది.
టిఆర్ఎస్ కు 45 నుంచి 50 సీట్లు వస్తాయని చర్చ జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన కేసీఆర్ సోమవారం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో సమావేశమవుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు విషయంలో వారి మధ్య కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటులో మజ్లీస్ కీ రోల్ పోషించనుంది. కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తే లేదని మజ్లిస్ ఇప్పటికే ప్రకటించింది. టిఆర్ఎస్ 50 సీట్లు గెలిచినా మజ్లిస్ 8 సీట్లు గెలుస్తామని భావిస్తోంది. దీంతో 58 మంది సభ్యులు కాగా మరో ముగ్గురిని ఇండిపెండెట్లు లేదా ఇతర పార్టీల వారిని తీసుకోనైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని టిఆర్ఎస్ ప్లాన్ ఏ కసరత్తు చేస్తోంది.
మరో వైపు బిజెపి నేతలు కూడా మద్దతు ఇస్తామనడంతో మజ్లిస్ తో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో టిఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. బిజెపితో కలిసినట్టయితే తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశ్యంతో నే టిఆర్ఎస్ బిజెపికి అంటి ముట్టనట్టు వ్యవహరిస్తోంది. కానీ ప్రభుత్వ ఏర్పాటు ఇబ్బంది అయిన పరిస్థితిలో మాత్రం తప్పకుండా బిజెపి మద్దతు తీసుకోవాలని టిఆర్ఎస్ ప్లాన్ బి రెడీ చేసినట్టు తెలుస్తోంది. వీటన్నింటి పై చర్చించేందుకే కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. గత 21 రోజులుగా కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాం హౌజ్ నుంచి రాజకీయ వ్యూహాలు చేశారు. పరిస్థితులు మారుతుండడంతో ఆయన హూటాహూటిన ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
టిఆర్ ఎస్ వ్యూహాలతో కూటమి నేతలు అలర్ట్ అయ్యారు. తాము ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేసినప్పటికి మెజార్టీ సీట్ల పై వారు డౌట్ గా ఉన్నారు. దీంతో బిజెపితో కూటమి కలిసే ప్రసక్తే లేదు. మజ్లిస్ కాంగ్రెస్ తో కలవమని స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ కు ఇక మిగిలింది ఇండిపెండెట్స్, పార్టీ రెబల్స్, బిఎల్ ఎఫ్ మాత్రమే. దీంతో స్వతంత్రులతో, రెబల్స్ తో ఇప్పటకే కీలక నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మద్దతు ఇవ్వాలని ప్రభుత్వ ఏర్పాటులో సహకరించాలని వారు కోరుతున్నారు. బిఎల్ ఎఫ్ ఫ్రంట్ కూడా రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందన్న సమాచారంతో కూటమి పెద్దలు వారితో కూడా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
కూటమి 50 నుంచి 55 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కావాల్సిన మరికొందరి కోసం నేతలు తమ ఎత్తుగడలు ప్రారంభించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం చివరి నిమిషంలో పార్టీలు నేతలకు ఎటువంటి తాయిలాలు ఇచ్చేందుకు కూడా నేతలు వెనుకాడని పరిస్థితి ఉండడంతో అంతా అలర్ట్ అయ్యారు. కూటమిలోని అన్ని పార్టీలను ఒకే పార్టీగా భావించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కు కూటమి నేతలు సోమవారం వినతిపత్రం సమర్పించనున్నారు.
తెలంగాణలో రాజకీయాలు రోజుకో తీరుగా మలుపు తిరుగుతున్నాయి. మరో 20 గంటల్లో పూర్తి భవితవ్యం బయటపడనుంది. మెజార్టీ సీట్లు రావడం కష్టమని టిఆర్ఎస్, కూటమినేతలు భావిస్తుండడంతో తెలంగాణ ప్రజలల్లో హంగ్ చర్చ మొదలైంది. కర్నాటక, తమిళనాడు పరిస్థితి తెలంగాణలో రాబోతుందా అనే చర్చ జరుగుతోంది.
కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ మాట్లాడితే ప్రభుత్వాలు ఏర్పాటు చేసేవారు ఎవరైనా సరే మాకు గొడుగు పట్టాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి అప్పట్టో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇప్పడు కేసీఆర్ మజ్లిస్ తో చర్చలు జరపనుండడంతో ఈ వ్యాఖ్యల పై ప్రాధాన్యత సంతరించుంది. ఆ వీడియో కింద ఉంది చూడండి.