ఢిల్లీ లిక్కర్ స్కాం కి సంబంధించి మీడియాలో ఏ విషయం వచ్చినా.. దానికి అనుబంధంగా వెంటనే బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత పేరు పేరు చర్చల్లోకి వచ్చేసుంది. ఈ కేసుకు సంబందించి ఎవరు అరెస్టు జరిగినా.. “తర్వాత కవితే” అనే కామెంట్లు వచ్చేస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే… తాజాగా లిక్కర్ స్కాంకు సంబందించి హైదరబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైని అరెస్టు చేసింది ఈడీ. దీంతో మళ్లీ కవితక్క ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ అయ్యిందంటున్నారు!
వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబందించిన అరెస్టుల పర్వాన్ని కంటిన్యూ చేస్తూ… మరొకరిని అరెస్ట్ చేసింది. ఇప్పటికే పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి కీలక సమాచారాన్ని సేకరించిన దర్యాప్తు సంస్థ… అభిషేక్ బోయిన్ పల్లి, సమీర్ మహేంద్రూ, విజయ్ నాయర్ తదితరులకు రామచంద్ర పిళ్లై సహకరించారని భావిస్తోంది. దీంతో రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది.
మద్యం కుంభకోణంలో అవకతవకలపై ఇప్పటికే రెండు రోజులపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. తాజాగా పిళ్ళైని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదేక్రమంలో.. అరుణ్ పిళ్ళైకి చెందిన వట్టినాగులాపల్లిలో 2.2 కోట్ల రూపాయల విలువైన భూమిని కూడా జప్తు చేశారు. దీంతో… ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి రామచంద్ర పిళ్లైతో కలిపి ఇప్పటి వరకూ 11 మందిని ఈడీ అరెస్ట్ చేసినట్లయ్యింది.
అయితే… ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టైన వారిలో ఎక్కువమంది హైదరాబాద్ కు చెందిన వారే ఉండటం గమనార్హం. దాంతో.. ఈ వరుస అరెస్ట్‌ల నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. తదుపరి అరెస్ట్ కవితదే అంటూ ఆన్ లైన్ వేదికగా ప్రచారం స్టార్ట్ అయిపోయింది! కాగా… ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అరెస్టైన సంగతి తెలిసిందే!