తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, వెలువడిన ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ టూర్ మీద భిన్నాభిప్రాయాలు, అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా ఆంధ్రావాసుల్లో కేసీర్ టూర్ హాట్ టాపిక్ అయింది. కేసీర్ ఢిల్లీ వెళ్లడమే జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలుసుకున్నారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు, కేంద్రం నిధుల గురించి మంత్రితో మాట్లాడిన కేసీఆర్ పనిలో పనిగా ఏపీతో నెలకొని జలవివాదాన్ని కూడ ప్రస్తావనకు తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రస్తావనలో కేసీఆర్ ఏం మాట్లాడు ఉంటారనేది చర్చకు దారితీస్తోంది. నిజానికి ఇరు రాష్ట్రాల మధ్యన పోతిరెడ్డిపాడు విషయంలో వివాదం జరుగుతోంది.
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి సంగమేశ్వరం నుండి శ్రీశైలం కుడి కాలువకు రోజుకు మూడు టీఎంసీల నీటిని తీసుకోవడానికి కొత్త ప్రాజెక్ట్ కట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించుకుంది. ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి జీవోను సిద్ధం విడుదలచేసింది. దీంతో కేసీఆర్ మండిపోయారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్ట్ కట్టనిచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. కేంద్ర జలవనరుల శాఖ నుండి ప్రాజెక్ట్ పనులు నిలపాలని స్టే తీసుకొస్తే కేసీఆర్ అండ్ కో కృష్ణా రివర్ బోర్డ్ ద్వారా స్టే ఇప్పించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇరువురి మధ్యన మీటింగ్ పెట్టినా సమస్య కొలిక్కిరాలేదు. ఈనేపథ్యంలో మాటల తూటాలు పేలాయి. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రావాసులు కేసీఆర్ రాయలసీమకు మంచిచేసే ప్రాజెక్టుకు ఇలా అడ్డుపడటం బాగోలేదని అన్నారు.
ఈ కోపాన్ని గ్రేటర్ ఎన్నికల్లో చూపుతారని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆంధ్రా సెటిలర్లు తెరాసను గొప్పగా ఆదరించారు. తెలంగాణ ప్రజానీకం తిరస్కరిస్తే ఆదుకొని పరువు నిలబెట్టారు. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉండే స్థానాల్లోనే గులాబీ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచింది. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ సెటిలర్లకు రుణపడ్డట్టే అనుకోవాలి. మరి ఈ రుణాన్ని ఆయన పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంలో పెద్ద మనసుతో సర్దుకుని తీర్చుకుంటారని కొందరు సెటిలర్లు, ఆంధ్రా జనం అనుకున్నారు. తెలంగాణ ప్రజలైతే గ్రేటర్ ఎన్నికల్లో ఆదరించారని కేసీఆర్ ప్రాజెక్టుకు అడ్డుతప్పుకుంటారేమోనని కంగారుపడ్డారు.
అయితే కేసీఆర్ మాత్రం పాత మాట మీదే ఉన్నట్టు కనిపిస్తోంది. మంత్రి వద్ద ఆయన పోతిరెడ్డిపాడు మీద అసహనం వ్యక్తం చేశారని వార్తలొస్తున్నాయి. దీంతో ఓట్లు వేసి ఆదరించినందుకు సర్దుకుని ప్రాజెక్ట్ ముందుకెళ్ళేలా సహకరిస్తారేమోనని ఆశపడిన సెటిలర్లు షాక్ తిన్నారు. ఇంత మంచి చేస్తే మళ్ళీ పాత పాటే అందుకున్నారే అంటూ నిరుత్సాహపడుతున్నారు. అయితే కేసీఆర్ గతంలోనే చెప్పేశారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లే పని చేయమని. ఆ ప్రకారమే గ్రేటర్ ఎన్నికల విషయాన్ని పక్కనపెట్టేసి భవిష్యత్తు ఎన్నికల కోసం ఎప్పటిలాగే అభ్యంతరం చెప్పేశారు.