ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు కేసీఆర్కు పలు రకాలుగా కళ్ళు తెరిపించాయి. తనకు ఈనాటికీ తిరుగులేదనుకున్న ఆయనకు రెండో విడత పాలనాకాలంలో సగం పూర్తయ్యేనాటికి వ్యతిరేకత మొదలైందని తెలిసొచ్చింది. ఉద్యమ వేడిని ఇంకెన్నాళ్లో వాడుకోలేరని తెలిసొచ్చింది. విసిగిస్తే సొంత జనమైనా సరే పక్కనపెట్టేస్తారని అర్థమైంది. వీటితో పాటే ఆంధ్రా వాళ్ళ సహాయాన్ని జీవితంలో మర్చిపోకూడదని తెలిసొచ్చింది. గత ఎన్నికల్లో 99 సీట్లు పొందిన తెరాస ఈసారి 55 స్థానాలకే పరిమితమైంది. ఈ విపరీతమైన వ్యతిరేకత తెలంగాణ ప్రజానీకం నుండే పుట్టుకొచ్చింది. ఒకప్పుడు ఓట్లేసి నెత్తిన పెట్టుకున్న జనం నుండే విముఖత వెలువడింది. కానీ పక్క రాష్ట్రం నుండి వచ్చిన సెటిలర్లు మాత్రం తెరాసను ఆదుకున్నారు.
కష్టకాలంలో అండగా నిలిచి పరువు కాపాడారు. ఈ ఎన్నికల్లో తెరాస గెలిచినా 55 స్థానాల్లో మెజారిటీ స్థానాలు ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆంధ్రావాళ్ళు ఎక్కువగా నిలువాసముండే కూకట్ పల్లి, సికింద్రాబాద్ జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి లాంటి చోట్ల పూర్తిగా తెరాస ఆధిక్యం కనబడింది. నిజానికి ఆంధ్రా ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట ఆశలు వదిలేసుకున్నారు గులాబీ పార్టీ నేతలు. కానీ చివరికి ఆ ప్రాంతాల్లోనే గెలుపు గుర్రాలు ఎక్కారు. ఆంధ్రా ఓటర్ల ప్రాభవం ఎక్కువగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 32 స్థానాల్లో తెరాస గెలిచింది. అంటే సగం గెలుపు ఆంధ్రా ఓటర్లు ఇచ్చినదే అనుకోవాలి. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కారు జోరు కనబడలేదు.
బీజేపీ హవా ముందు తేలిపోయారు. పదుల, వందల సంఖ్యలో ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయామని, పెద్దగా చింతించాల్సిన పనిలేదని తెరాస పెద్దలు తమకు తాము సర్దిచెప్పుకున్నా కూడ ఓడిపోవడం అయితే జరిగిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రేటర్లోని తెలంగాణ ప్రజానీకం ఖచ్చితమైన మార్పును కోరుకుంది. ఆంధ్రా ఓటర్లే గనుక ఆదుకోకపోయి ఉంటే ఈ మార్పు తెరాసకు ఒక పీడకలలా మిగిలి ఉండేది. కానీ ఒక్కసారి గతం చూసుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నుండి తెరాసలోని చివరాఖరి గల్లీ లీడర్ వరకు ఆంధ్రా సెటిలర్లను ఎంతలా తిట్టిపోశారో తెలుస్తుంది. రాష్ట్రం విడిపోయినా సిగ్గులేకుండా ఇంకా ఇక్కడే ఉన్నారని నోరుపారేసుకున్న వాళ్లూ ఉన్నారు.
కనికరం లేకుండా దాడులు జరిపిన సందర్భాలున్నాయి. ఆ వేడిలో కేసీఆర్ బయటకు ఆంధ్రా వాళ్లకు రక్షణ కల్పిస్తామని చెప్పినప్పటికీ దాన్ని ఎంత మాత్రం అవలంభించారో అందరికీ తెలుసు. స్థానికేతరులనే పేరుతో అడుగడుగునా అడ్డగిస్తూనే వచ్చారు. ఆంధ్రోళ్లంతా దోపిడీదారులనే స్టేజికి వచ్చేశారు. ఇప్పుడు ఆ ఆంధ్రా సెటిలర్లే తెరాస, కేసీఆర్ పరువును నిలబెట్టారు. చిత్తుచిత్తుగా ఓడకుండా కాపాడారు. ఈ ఫలితాలతో అధికార పార్టీ గ్రహించాల్సిన నీతిని గ్రహిస్తే మంచిది.