ఆంధ్రా వానకు వణుకుతున్న తెలంగాణ

ఆంధ్ర పెథాయ్ వానల్లో తడుస్తూంటే, తెలంగాణ గజగజ వణికి పోతున్నది, ఆంధ్ర తెలంగాణ విడిపోయాయని అన్నదెవరు? అనే జోక్ రెండు రోజులుగా సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొట్టింది.

తెలంగాణ వాసుల్ని ఇంతగా రెండు రోజుల పాటు గజగజ వణికించిన  ఆంధ్రా ఇష్యూ మరొకటి లేదు, పెతాయ్ తుఫాన్ తప్ప.  పెధాయ్ తుఫాన్ హైదరాబాద్ ను నడి శీతాకాలపు ఢిల్లీలాగా మార్చేసింది.

హైదరాబాద్ వాసులకు రెండురోజులుగా సూర్యుడు కనిపించనే లేదు. ఇలాంటి శీతాకాలం హైదరాబాద్ చరిత్రలో ఉండదేమో. వర్షాలు వల్ల మేఘాలు దట్టంగా ఆవరించి ఒక పూట పొద్ద పొడవకపోవచ్చు గాని, ఇలా శీతాకాలం మంచులాగా ఒక చల్లటి తేమ పొర హైదరాబాద్ నగరాన్ని చుట్టేయం ఎపుడూ జరగలేదు. అసలే శీతాకాలం, దీనికి పెధాయ్ ఉగ్ర రూపం తోడయింది.  ఆంధ్రలో తుఫాన్ కొత్తకాదు, ఆంధ్ర తుఫాన్ తుంపరలు తెలంగాణలో కొత్త కొత్త కాదు. ఈ ఆంధ్ర తుఫాన్ చలి మాత్రం  హైదరాబాద్ కు, కొన్ని తెలంగాణ జిల్లాలకు  కొత్తేననివాతావరణ శాఖ వారు కూడా అంటున్నారు.

మంగళవారం నాడు హైదరాబాద్ టెంపరేచర్ 19.8 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. కనిష్ట ఉష్ణోగ్రత కూడా 18 నుంచి 15 మధ్య వూగిసలాడింది.నిన్నంతా రాజధాని ప్రజలు గజగజ వణికేందుకు ఈ ఉష్ణోగ్రత పతనమే కారణం. గత ఏడాది కూడా హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉంండింది. కాని ఇది అకస్మికంగా వచ్చింది. పెద్ద ఎత్తున దాడి చేసిందని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు.

అసలే ఉత్తరాది నుంచి శీతాకాలపు గాలులు వస్తున్నాయి. దీనికి వర్షవాతావారణం. ఫలితంగా తెలంగాణాలో అనేక చోట్ల టెంపరేచర్ సాధారణంగా ఉండాల్సిన దాని కన్నా 9 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ తగ్గిపోయింది. ఇది అసాధారణం అని వై కె రెడ్డి ,హైదరాబాద్ వాతావారణ శాఖ, డైరెక్టర్ అంటున్నారు. హన్మకోండ, భద్రాచలం, ఖమ్మంలో పరిస్థితి మరి తీవ్రంగా ఉంది. ఇక్కడ నార్మల్ కంటే టెంపరేచర్  18 డిగ్రీల సెల్సియస్ పడిపోయింది.అందుకే తెలంగాణలో చాలా చోట్ల రెండు రోజులుగా పొద్దు పొడచలేదు, సూర్యుడు కనిపించలేదు, ఎండలేదు, ఎముకలు కొరికే చలిలో జనం గజగజ వణికిపోయారు,