ఫెథాయ్ తుఫాన్ లో ఇరికిపోయిన ఆంధ్రా మంత్రి కారు (వీడియో)
ఆంధ్రాలో పెథాయ్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. తుపాన్ కారణంగా పలు రైళ్లు, బస్సులు రద్దు అయ్యాయి. కొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నారు. పెథాయ్ కాకినాడ, యానాం మధ్య తీరం దాటింది. దీంతో ఈదురు గాలులు, జోరు వానతో కోనసీమ అతలాకుతలం అవుతున్నది.
అయితే సామాన్య జనాలపై తుపాన్లు ప్రభావం చూపుతుంటాయి. కానీ ఆంధ్రా మంత్రికి కూడా పెథాయ్ ప్రభావం గట్టిగానే తాకింది. సముద్ర తీరం ఒడ్డుకు వెళ్లి పరిసరాలను పరిశీలించే ప్రయత్నం చేసిన ఆంధ్ర ప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఊహించని అనుభవం ఎదురైంది.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గంటా భీమిలి దగ్గర్లోని మంగమర్రిపేట వద్ద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. దీంతో సముద్ర తీరంలోని ఇసుకలో ఇరుక్కుపోయింది మంత్రి గంటా శ్రీనివాసరావు కారు. ఆ కారును బయటకు లాగేందుకు సెక్యూరిటీ సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. ఒకవైపు వర్షం, ఈదురుగాలులు మరోవైపు కారు ఇసుకలో కూరుకుపోయింది. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి సముద్రపు ఒడ్డున చుక్కలు కనిపించాయి. మంత్రి కారు ఇరుక్కుపోయిన సందర్భంలో ఆయన కారులోనే ఉన్నారు. బయటకు దిగలేదని తెలుస్తోంది. తుదకు ఎలాగోలా కారును బయటకు లాగారు సెక్యూరిటీ సిబ్బంది.
గంటా శ్రీనివాసరావు కారును ఎలా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారో కింద వీడియో ఉంది చూడండి.
తుఫాన్ సహాయక చర్యల్లో మంత్రులు బిజీ అయ్యారు. కొందరు ఎఫెక్టెడ్ ఏరియాల్లో పర్యటించి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. మరికొందరు కలెక్టరేట్లలో కూర్చొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎపి సిఎం చంద్రబాబు కూడా తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో పర్యటటన చేపడుతున్నారు.