మారుతీరావు మద్దతుదారులకు అమృత సీరియస్ వార్నింగ్

సామాజిక మాధ్యమాల్లో తనను అవమానించేలా పోస్టులు పెడితే కేసులు పెడతానని ప్రణయ్ భార్య అమృత వర్షిణి హెచ్చరించింది. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య అనంతరం అనేక మంది రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు వెళ్లి అమృతను పరామర్శించి మద్దతు పలికాయి. ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, భూమి, 14 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని పై సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తాయి.

ఒక ప్రేమికునికి అంత ఇస్తే దేశ సైనికులు చని పోయారు వారికెంత ఇవ్వాలని, దేశం కోసం సేవ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు వారి విగ్రహాలు పెట్టాలని పలువురు కామెంట్స్ చేశారు. ఇవన్నీ తనను చాలా బాధ పెట్టాయని తన గుండెలోని ఆవేదనతో విగ్రహం పెట్టాలని అన్నానని, ఏ స్త్రీ కైనా తన భర్త గొప్పవాడని తాను తన భర్త గొప్పవాడని అనుకుంటున్నానని అందులో తప్పేముందో చెప్పాలని అమృత ప్రశ్నించింది.

తమ 9వ తరగతి ప్రేమను తప్పు పట్టడాన్ని కూడా అమృత విమర్శించింది. తాము తొమ్మిదో తరగతిలో ఉన్నా అప్పుడు తమది స్నేహమేనని మాకంటూ ఒక అవగాహన వచ్చాకే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని ఏనాడు తమ హద్దు దాటి ప్రవర్తించలేదన్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపిస్తారా అని నెటిజన్లకు అమృత ప్రశ్నల వర్షం కురిపించింది.

అమృత రావు తన తండ్రని తన క్షేమం కోరుకునే వాడే అయితే తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశాడంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త లేడు, ప్రేమగా పెంచిన నాన్న హంతకుడయ్యాడు, కడుపులో బిడ్డ… గమ్యం తెలియని పరిస్థితిలో తాను తల్లడిల్లుతుంటే మనసుకి తూటాల్లా నెటిజన్ల మాటలు తాకుతున్నాయి. చివరికి ప్రణయ్ తమ్మునికి… తనకు లింక్ కలిపి కామెంట్స్ చేస్తున్నారని ఇవి చూసినప్పుడు తన మనస్సు కకావికలం అవుతుందని తనను చంపొద్దని అమృత విలపించింది. కాస్త కుదుట పడ్డాక ఇటువంటి కామెంట్స్ చేసే వారందరిని ఐపీ అడ్రస్ లతో సహా గుంజి కేసు ఫైల్ చేయించి కోర్డుకీడుస్తానని గద్గర స్వరంతో అమృత హెచ్చరించింది.

నాకు మద్దతుగా ఇంత మంది సపోర్టు ఇస్తే దివంగత ప్రణయ్ నాకు సమాజాన్నే కుటుంబంగా ఇచ్చాడనుకొని సంతోషించే లోపే ఇటువంటి వ్యాఖ్యలు వచ్చి మనస్సును కకావికలం చేశాయని అమృత ఆవేదనను వ్యక్తం చేసింది. నెటిజన్లు అన్ని కోణాలలో ఆలోచించాలని ఇలా చేస్తే సమాజంలో ఆందోళన జరిగే అవకాశం ఉంటుందని, సంయమనం పాటించాలని ప్రజాసంఘాల నేతలు, విశ్లేషకులు, మేధావులు సూచించారు.