మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ సంస్మరణ సభ కుల సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో ప్రణయ్ భార్య అమృత పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రణయ్ యాక్ట్ తీసుకురావాలని అమృత డిమాండ్ చేసింది.
ప్రణయ్ యాక్ట్ తీసుకురావాలంటే పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇందులో తప్పేముందో చెప్పాలని అమృత ప్రశ్నించింది. నిర్భయ యాక్ట్ ఎందుకు వచ్చిందో మనందరికి తెలియదా అని అమృత ప్రశ్నించింది. ఢిల్లీలో ఒక అమ్మాయిని దారుణాతీ దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి హత్య చేయడంతో దేశం అంతా ఏకమై పోరాడితే నిర్భయ యాక్ట్ తీసుకువచ్చిందని అలాగే మరో దళిత యువకుడు, కుల రహితంగా పెళ్లి చేసుకున్న వారు చనిపోవద్దంటే ప్రణయ్ యాక్ట్ తీసుకురావాలని అమృత డిమాండ్ చేసింది.
మరికొంత మంది ప్రణయ్ విగ్రహం పెడితే భవిష్యత్తులో తమ పిల్లలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. లవ్ చేయడం వల్ల చనిపోయాడని చెప్పాలా అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారని ఇది చాలా తప్పని అమృత తెలిపింది. లవ్ చేసుకోవడం వల్ల కాదు తక్కువ కులంలో పుట్టాడని చంపేశారని పిల్లలకు చెప్పాలని అమృత కోరింది. ప్రేమ అనేది తప్పు కాదు అని చెప్పండని చెప్పింది. అతనిని చంపడంతో అందరికి కఠిన శిక్ష పడిందని చెప్పాలని సూచించింది.
ప్రణయ్ యాక్ట్ తో పాటు, ప్రణయ్ విగ్రహాన్ని పెట్టాల్సిందేనని అమృత డిమాండ్ చేసింది. ఇవి రెండు పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితిలో తగ్గేదే లేదని, ఉద్యమ పంథా ఎంచుకొని పోరు సాగిస్తానని అమృత తెలిపింది. సంస్మరణ సభలో అన్ని కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, విమలక్క పాల్గొన్నారు.
ప్రేమ వివాహం చేసుకుందని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో సెప్టెంబర్ 14, 2018 న అతి కిరాతకంగా ప్రణయ్ ని హత్య చేయించాడు. ఈ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన తన కూతురు దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ ను అతి దారుణంగా హత్య చేయించాడు.
ప్రణయ్ హత్య తర్వాత అమృత జస్టిస్ ప్రణయ్ అనే పేరుతో ఫేస్ బుక్ పేజిని ప్రారంభించింది. ఈ పేజిని దాదాపు 1,40,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఈ పేజిలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా పలు కామెంట్లు చేస్తున్నారు. కొంత మందైతే ఏకంగా అసభ్యకమైన కామెంట్లు చేస్తున్నారు. ముందుగా అటువంటి కామెంట్లు చేసే వారికి అమృత హెచ్చరించినా వారు వినలేదు. దీంతో అమృత మిర్యాలగూడ సీఐకి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆధారాలతో సహ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అమృత ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈశ్వర్ ను అరెస్టు చేశారు.
అమృత విషయంలో పోలీసులు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. తనకు వస్తున్న బెదిరింపులపై ఇప్పటికే అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమృత ఫిర్యాదు నేపథ్యంలో ఆమెకు భద్రతగా ఇప్పటికే ఇద్దరు సాయుధ సిబ్బందితో పాటు ఇద్దరు మహిళా కానిస్టేబుల్లను నియమించారు. అమృతకు వస్తున్న బెదిరింపులు, భద్రత వ్యవహారాల పై ఎప్పటికప్పుడు నిఘా విభాగం అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు.
మిర్యాలగూడ సంస్మరణ సభ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి