మిర్యాలగూడ అమృత ప్రణయ్ కేసులో మరో విషయం బయటపడింది. అమృత ప్రణయ్ ల రిసెప్షన్ ను అడ్డుకోవడానికి మారుతీరావు విఫలప్రయత్నం చేశారని తేలింది. దినేష్, కార్తీక్ అనే యువకులకు ఈ పని అప్పగించగా వారు దీనికి ఒప్పుకోలేదని తెలిసింది.
ఆ రిసెప్షన్ లో గొడవ సృష్టించాలని అది ఆగిపోయేలా చేయాలని వారిపై మారుతీరావు ఒత్తిడి తెచ్చాడు. దీనికి వారు ఒప్పుకోకపోవడంతో మారుతీరావు తన తమ్ముడితో కలిసి వారిద్దరిని బెదిరించాడు. దీనికి సంబంధించి యువకులు పిర్యాదు చేయగా వారిపై మరో కేసు నమోదైంది.
అమృత ప్రణయ్ ల రిసెప్షన్ జరపడం ఏ మాత్రం ఇష్టం లేని మారుతీరావు దానిని ఎలాగైనా ఆపాలని కుట్రపన్నాడు. అయితే ఈ కార్యక్రమానికి అప్పటికే పోలీసు బందోబస్తు ఉండటంతో మారుతీరావు ఏం చేయలేకపోయారు. ప్రణయ్ తల్లిదండ్రులు దాడి జరుగుతుందని ముందుగానే ఊహించి పోలీసు రక్షణ కోరారు. దీంతో మారుతీరావు కుట్ర విఫలమైంది.
అమృత ప్రణయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ని కిరాయి హంతకులతో అతి కిరాతకంగా చంపించారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. పరువు హత్యల పరంపర మొదలైందని పలు కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
అమృతను మరిచిపోతే రూ.3 కోట్ల రూపాయలు ఇస్తానని మారుతీరావు ప్రణయ్ కి ఆఫర్ ఇచ్చారని అయినా కూడా ప్రణయ్ లొంగకపోవడంతో మారుతీరావు మరింత కక్ష్య పెంచుకున్నారు. అనేక సార్లు పెద్ద మనుషులలో పెట్టి మాట్లాడారు. అమృతను కాలేజి బంద్ చేపించారు. అయినా కూడా వారి ప్రేమ ఆగలేదు.
ఇక ఇలానే ఉంటే బాగుండదనే ఉద్దేశ్యంతో అమృతప్రణయ్ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. ప్రణయ్ తల్లిదండ్రులు వీరి వివాహానికి ఒప్పుకోవడంతో రిసెప్షన్ జరిపించారు. అప్పటి నుంచి మారుతీరావు కక్ష్య పెంచుకోని ప్రణయ్ హత్యకు జూన్ నుంచి పథకం పన్నాడు.
మిర్యాలగూడకు చెందిన కాంగ్రెస్ లీడర్ ను సంప్రదించి అతని ద్వారా పాతబస్తికి చెందిన రౌడీలతో చేతులు కలిపి బీహార్ రాష్ట్రానికి చెందిన శర్మతో ప్రణయ్ ని హత్య చేయించారు. శర్మ ప్రణయ్ ఇంటి వద్ద దాదాపు 3 సార్లు రెక్కీ నిర్వహించినట్టు సీసీ ఫుటేజిలో స్పష్టమైంది.
హత్యకు కుట్ర పన్నిన వీరు మిర్యాలగూడలో పక్కా ప్లాన్ వేశారు. ఆగష్టు లోనే ప్రణయ్ ని చంపాలని అనుకున్నా ప్రణయ్ వెంట అతని తమ్ముడు ఉండటంతో అప్పుడు ఆగిపోయారు. ఆ తర్వాత మరో రెండు సార్లు ప్రయత్నించినా అది కూడా కుదరలేదు. చివరి సారి విఫలమైతే శర్మ తన ఊరికి వెళ్లి పోతానని మారుతీరావుకు చెప్పాడు.
అమృత ప్రణయ్ వినాయక చవితి తర్వాత రోజు హాస్పిటల్ కి చెకప్ కి వెళ్లి వస్తుండగా బయట మాటు వేసిన శర్మ రెండు కత్తిపోట్లతో ప్రణయ్ ని నరికి చంపేశాడు. దీంతో ప్రణయ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మారుతీరావు అనేక మందిని ప్రణయ్ చంపేందుకు కలిసినట్టు తెలుస్తోంది. ప్రణయ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూ కొత్త కొత్త విషయాలు బయటికొస్తున్నాయి.
అమృత ప్రణయ్ రిసెప్షన్ వీడియో కింద ఉంది చూడండి