మిర్యాలగూడ అమృత విషయంలో పోలీసుల స్ట్రాంగ్ డిసిషన్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులపై పిడి యాక్ట్ మోపాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు పై ఎస్పీ రంగనాథ్ తో ఐజీ స్టీఫెన్ రవీంద్ర చర్చించారు.

గతంలో మారుతీరావు పై మరియు అతని సోదరుని పై ఉన్న కేసుల దృష్ట్యా వారి పై పీడి యాక్ట్ పెట్టాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో వైపు ఐజీ రవీంద్ర అమృతకు సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపులపై ఆరా తీశారు. అమృతను బెదిరిస్తున్న వారికి నిందితులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

తండ్రి మారుతీరావుతో అమృత

అమృత విషయంలో  పోలీసులు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. తనకు వస్తున్న బెదిరింపులపై ఇప్పటికే అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమృత ఫిర్యాదు నేపథ్యంలో  ఆమెకు భద్రతగా ఇప్పటికే ఇద్దరు సాయుధ సిబ్బందితో పాటు ఇద్దరు మహిళా కానిస్టేబుల్లను నియమించారు. అమృతకు వస్తున్న బెదిరింపులు, భద్రత వ్యవహారాల పై ఎప్పటికప్పుడు నిఘా విభాగం అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారని తెలుస్తోంది.

అమృత పై  సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వచ్చాయి. 9 వ తరగతిలో ఏం ప్రేమ అని, అమృత ప్రణయ్ తమ్ముడిని పెళ్లి చేసుకుంటుందని, మారుతీరావు చేసింది కరెక్టే అని చాలా మంది విమర్శలు చేశారు. వీటన్నింటి పై అమృత వారికి వార్నింగ్ ఇచ్చినప్పటికి కూడా వారు వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

రిసెప్షన్ లో అమృత, ప్రణయ్ దంపతులు

రెండు రోజుల క్రితమే హైదరాబాద్ కు చెందిన దంపతులు ప్రణయ్ ఇంటికి వెళ్లి అమృతను కలిశారు. ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతుందని ప్రణయ్ ఆత్మ మీ ఇంటి చుట్టే తిరుగుతుందన్నారు. మీరు ఒప్పుకుంటే ప్రణయ్ ఆత్మను మీతో మాట్లాడిస్తామని అమృతను నమ్మించారు. ప్రణయ్ విగ్రహాన్ని కూడా పెట్టవద్దని అలా చేస్తే ఆ విగ్రహంలో ప్రణయ్ ఆత్మ అందులో బంధీ అవుతుందన్నారు.

ఆ దంపతులపై అనుమానం వచ్చిన అమృత మిర్యాలగూడ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అమృతను చంపుతామని కూడా పలువురు బెదిరించినట్టు వార్తలు రావడంతో పోలీసులు అమృతకు భద్రతను ఏర్పాటు చేశారు.

ప్రణయ్ ఆత్మను చూపిస్తామని వచ్చిన వారికి నిందితులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని పోలీసులు విచారిస్తున్నారు. ప్రణయ్ విగ్రహాన్ని పెట్టవద్దని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేక శక్తులే ఈ పని చేశారా అని పోలీసలు విచారిస్తున్నారు.

ఏదేమైనా అనేక మలుపులు తిరుగుతున్న ప్రణయ్ మర్డర్ కేసులో అమృతకు ప్రాణహాని లేకుండా పోలీసులు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఆమెకు భద్రత పెంచారు. అమృత ప్రస్తుతం గర్భవతి కావడంతో ఆమెకు జరగకూడనిది ఏమైనా జరిగితే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటున్నారు. అమృతతో కూడా నిత్యం పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.