తమిళనాడుకు చెందిన ఒక జంట మిర్యాలగూడ అమృతకు అరుదైన కానుక అందజేసింది. మంగళవారం ఆ జంట మిర్యాలగూడ వచ్చి భర్తను పోగోట్టుకున్న అమృతను పరామర్శించారు. ఆ తమిళ దంపతులిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నవారు. ప్రణయ్ విగ్రహన్ని అమృతకు అందజేశారు.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన కేఎస్ శంకర్, రేష్మారెడ్డిలు అమృతను పరామర్శించారు.ప్రణయ్ తండ్రిని కౌగిలించుకొని శంకర్ కన్నీరు పెట్టారు. అమృత నుంచి సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. తాము ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రణయ్ కాంస్య విగ్రహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రణయ్ విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అమృతకు భర్తను, పుట్టబోయే బిడ్డను దూరం చేసిన మారుతీరావును ఉరితీయాలని డిమాండ్ చేశారు. పరువు హత్యలు జరుగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాజంలోని మానవతావాదులంతా ప్రణయ్ కుటుంబానికి అండగా నిలవాలని శంకర్ కోరారు.
రేష్మారెడ్డి మాట్లాడుతూ పరువు హత్యతో మారుతీరావు సాధించింది ఏముందని ప్రశ్నించారు. తాను దళితుడైన శంకర్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నానని చెప్పారు. కులాంతర వివాహ చట్టాలను ప్రభుత్వాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.