మహా కూటమికి మరో షాక్, మహిళా నేత గుడ్ బై

పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్నవేళ తెలంగాణ మహా కూటమికి మరో గట్టి షాక్ తగిలింది. తెలంగాణ జెఎసిలో, తెలంగాణ జన సమతి పార్టీలో కీలక నాయకురాలిగా వ్యవహరించిన అడ్వొకెట్ రచనా రెడ్డి టిజెఎస్ పార్టీకి రాజీనామా చేశారు. టిఆర్ఎస్ సర్కారుపై నాలుగున్నరేళ్లలో న్యాయస్థానాల్లో ఫైట్ చేసిన రచనారెడ్డి బాగా పాపులర్ అయ్యారు. కేసిఆర్ కు కంటిమీద కునుకులేకుండా చేసిన ఉద్యమకారుల జాబితాలో రచనారెడ్డి ఒకరు. ఆమె కోర్టుల్లో చేసిన పోరాటం కేసిఆర్ సర్కారును ఇరకాటంలోకి నెట్టింది. ఒక దశలో కేసిఆర్ బహిరంగసభలోనే రచనారెడ్డి పేరు తీసుకుని ఆమె మీద నిప్పులు చెరిగారు. ఆమెను ఒక ముఠా సభ్యురాలిగా కేసిఆర్ అభివర్ణించారు.

రచనా రెడ్డి, మహిళా అడ్వొకెట్

అంతగా ఫైట్ చేసిన రచనారెడ్డికి ప్రజా కూటమిలో మొండిచేయి చూపారు నాయకులు. కూటమిలో భాగంగా రచనారెడ్డి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ కూటమిలో సీట్లన్నీ కాంగ్రెస్ తీసేసుకుంది. పట్టుమని పది సీట్లు కూడా కోదండరాం సంపాదించలేకపోయారు. దీంతో తెలంగాణ జన సమితి ద్వారా పోటీ చేసి రాజకీయాల్లో నిలబడాలని ఆశించి వచ్చిన వారంతా ఆందోళనలో ఉన్నారు. కూటమిలో డబ్బు కట్టలు చేతులు మారాయని రచనా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ఏ రకంగా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. ప్రజా కూటమి కాదని, విషపు కూటమి అని నింధించారు. రచనా రెడ్డి ఏం మాట్లాడారో ఆమె కామెంట్స్ కింద ఉన్నాయి చదవండి.

రాహుల్ ప్యారాచూట్ వ్యక్తులకు టికెట్లు ఇవ్వొద్దని చెప్పారు. కానీ మా పెద్ద మనిషి (కోదండరాం) కూటమికి కన్వీనర్. ఆయన ఏ దేశానికి రాజు. ఆయన స్వార్థం ఆయన చూసుకున్నారు. ఆయనను నమ్ముకొని వచ్చిన అభ్యర్థు రాజకీయ భవిష్యత్ ను నాశనం చేశారు. కాంగ్రెస్ లో పొలిటికల్ బ్రోకర్లు ఉన్నారు. అసలు ఓడిపోవడానికే కూటమి కట్టారా? అన్న అనుమానం కలుగుతున్నది.

చర్చల పేరుతో హోటల్స్ లో సమావేశాలు చేసి టైం పాస్ చేశారు. పైసలు వసూలు చేసి కూటమి కట్టారు. తెలంగాణలో గౌరవంగా ఉన్న మర్రి శశిధర్ రెడ్డి కుటుంబాన్ని బాధితులుగా మార్చారు. కాంగ్రెస్ లో తండ్రి శశిధర్ కు, టిజెఎస్ లో కొడుకు మర్రి ఆదిత్య రెడ్డికి మొండిచేయి చూపారు.  మైనార్టీలకు ఒక్క సీటే ఇచ్చారు. ఎస్ లు, ఎస్టీలకు జన సమితిలో అవకాశాలే రాలేదు. సామాజీక న్యాయం పాటించలేదు. ప్రత్యామ్నాయం లేకుండా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటట్లు కనిపించడం లేదు. జనసమితితో సహా కూటమిలో అన్ని పార్టీలు తప్పుగా కలిశాయి.

అనారోగ్యకరమైన రాజకీయ వాతావరణం కూటమిలో ఉంది. ఎవరో పైసలు ఇచ్చి మా చేతా ఇలా మాట్లాడించారని కాదు. టీజేఎస్ కు, కూటమికి నేను ప్రచారం చేయలేదు. కాంగ్రెస్ వాళ్లతోపాటు కోదండరాం కూడా ఓడిపోతున్నారు. ఎల్లారెడ్డిలో నాకు పోటీ చేయాలని మొదటి నుంచి లేదు. కానీ వంకాయలు, బీరకాయలు అమ్ముకున్నట్లు సీట్లు అమ్ముకున్నారు. టిజెఎస్ పెట్టడానికి కారణాలు ఏమిటి? మీరు చెస్తుందేమిటి? ప్రజలు ఆలోచించి ఓటు వేయండి.  5 పైసలకు కూడా పనికి రాని బ్రోకర్లు ఉన్నారు. పైసలు ఎవరికి ఇస్తే వారికే సీట్లు ఇచ్చారు. ఇలా చేస్తే కూటమి గెలుస్తుందా?

టిజెఎస్ కు గతంలో ఒక మహిళా నేత గుడ్ బై

తిరునగరి జోత్స్న, మాజీ తెలంగాణ జన సమితి మహిళా నేత

టిజెఎస్ పార్టీకి తాజాగా రచనారెడ్డి రాజీనామా చేశారు. ఆమెకంటే ముందే ఒక మహిళా నాయకురాలు, ప్రొఫెసర్ కూడా గుడ్ బై చెప్పారు. తిరునగరి జ్యోత్స్న అనే నాయకురాలు టిజెఎస్ రాజకీయాలను భరించలేక పార్టీని వీడారు. జన సమితి మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమె తన శక్తి మేర పా్టీలో పనిచేశారు. మహిళా ఉద్యోగుల సమస్యల మీద, మహిళల సమస్యల మీద పోరాటం చేశారు. కానీ ఆమె పోతూ పోతూ తీవ్రమైన విమర్శలు గుప్పించి వెళ్లారు. జన సమితిలో ఉన్న మల్కాజ్ గిరి ప్రస్తుత అభ్యర్థి కపిలవాయి దిలీప్ కుమార్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. కపిలవాయి దిలీప్ కుమార్ డబ్బు సంచుల కోసమే తెలంగాణ జన సమితిలో చేరినట్లు ఆరోపించారు. తాజాగా రచనా రెడ్డి కూడా పార్టీని వీడడం జన సమితి కే కాక కూటమికి కూడా ఇరకాటంగానే చెబుతున్నారు.