దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అటు జాతీయస్థాయిలోనూ.. ఇటు రాష్ట్రస్థాయిలోనూ ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇక బీఆరెస్స్ శ్రేణుల సంగతైతే చెప్పేపనిలేదు. హసినకు వెళ్లిన కవిత వెనక్కి వస్తారా.. విచారణ అనంతరం అటునుంచి అటే అరెస్టవుతారా అని తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇక ఈడీ నుంచి నోటీసులు అందుకున్న కవిత… న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం… విచారణకు ఇప్పట్లో రాలేనని, ఈనెల 15 తర్వాత విచారణకు హాజరవుతానని ఈడీకి లేఖ రాశారు.
ఒకవైపు బీఆరెస్ నేతల టెన్షన్ అలా ఉంటే… ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలు వారిని మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయట. అవును… ఢిల్లీ ప్రభుత్వానికి లిక్కర్ స్కాం ద్వారా 3వేల కోట్లకు పైచిలుకు నష్టం వాటిల్లిందని.. లిక్కర్ స్కాం అనేది పెద్ద సీరియస్ క్రైమ్ అని స్పష్టం చేస్తున్నారు రచనారెడ్డి. ఇదే క్రమంలో… “ఇది కేంద్రప్రభుత్వ కక్ష సాధింపు చర్య” అని బీఆరెస్స్ నేతలు చేస్తున్న కామెంట్లపై కూడా పరోక్షంగా స్పందించిన న్యాయవాది… “రాజకీయ దురుద్దేశాలతో కేసు పెట్టినట్లు లేదని.. పక్కాగా ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈ కేసు నడుస్తోంది” అని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో ఈ కేసులో కవిత చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నారని చెప్పిన రచనారెడ్డి… స్కాంలో కవిత పాత్ర ఉందని తేలితే మాత్రం భారీ జరిమానా విధించడంతోపాటు జైలు శిక్ష కూడా పడొచ్చని అభిప్రాయపడ్డారు. ఇందుకు పెద్దగా ఆలస్యం అవ్వదని.. కవితను విచారించిన వెంటనే అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని.. పక్కాగా ఆధారాలు ఉన్నాయి కాబట్టే మరోసారి విచారణకు రమ్మంటున్నారని రచనారెడ్డి తెలిపారు. ఈ న్యాయవాది కామెంట్స్ తో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన రెట్టింపయ్యింది!
కవిత ను ఈడీ విచారించిన అనంతరం అరెస్టు ఉండొచ్చన్న ఊహాగానాల నడుమ కేసీఆర్ ఒత్తిడికి గురయ్యారని సమాచారం! ఈ క్రమంలో హుటాహుటిన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు కేసీఆర్. ముఖ్యంగా ఈడీ విచారణకు హాజరుకావాలంటూ కవితకు నోటీసులు అందిన నేపథ్యంలో.. ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. కవిత ఈడీ విచారణ ముగిసిన అనంతరం.. ఒకవేళ అరెస్టయితే ఏవిధంగా వ్యవహరించాలనే అంశాలపై కూడా చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చించిన కేసీఆర్… మంత్రులతో కూడా డీప్ డిస్కషన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది!