ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య కీలక నిర్ణయం

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన నిర్ణయాలతో ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసింది. నూతన సంవత్సరం సందర్బంగా తన వద్దకు వచ్చే వారు బొకేలు, ఫ్లవర్లు తేవద్దని వాటి స్థానంలో దుప్పట్లు, కోట్లు తీసుకురావాలని ఆమె కోరారు. అనేక మంది ఇళ్లు లేవని వారంతా రోడ్ల పైనే రాత్రిళ్లు నిద్రిస్తున్నారన్నారు. వారి కోసం నైట్ షెల్టర్లు ఏర్పాటు చేశామని అందులో ఉండే వారికి దుప్పట్లు, స్వెట్లర్లు అందించాలని ఆమె పిలుపునిచ్చారు.  రోడ్ల పై చాలా మంది చలికి ఒణుకుతూ ఉంటారని అటువంటి వారికి దుప్పట్లు అందించి సాయమందించాలన్నారు. హాస్టల్ లో పిల్లలకు కూడా ప్రభుత్వం తరపున దుప్పట్లు అందజేశామని మరికొంత మంది ముందుకు వస్తే మరికొంత మంది విద్యార్దులకు దుప్పట్లు పంపిణీ చేయవచ్చన్నారు. ఆదిలాబాద్ లో మైనస్ డిగ్రీలలో ఉష్ణోగ్రత స్థితి పడిపోయిందన్నారు. 

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా దివ్య దేవరాజన్ గత రెండు సంవత్సరంనర నుంచి పని చేస్తున్నారు. ఆమె పాలనలో తనదైన మార్క్ వేసుకొని ప్రజలకు దగ్గరయ్యారు. ఆమె నిర్ణయాలన్నీ సామాన్య ప్రజానీకానికి అనుకూలంగా ఉంటాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటు వేయడానికి వచ్చే గర్బిణీ స్త్రీలకు, వృద్దులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దివ్య దేవరాజన్ చేసిన ఏర్పాట్లను చూసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులు మెచ్చుకున్నారు. 

దివ్యదేవరాజన్ చాలా సింప్లిసిటిగా ఉంటారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత వికారాబాద్ జిల్లాకు కలెక్టర్ గా దివ్య నియమితులయ్యారు. ఆ తర్వాత లంబాడా, గోండు తెగ ప్రజల మధ్య రిజర్వేషన్ల చిచ్చు రగలడంతో ఆదిలాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు ప్రభుత్వం అక్కడ గొడవలు సద్దుమణిగించేందుకు దివ్య దేవరాజన్ ను ఆదిలాబాద్ కలెక్టర్ గా బదిలీ చేసింది. దివ్య కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాత్రింబవళ్లు పని చేసి అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.

దివ్యదేవరాజన్ కలెక్టర్ గా గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రజలు ఆమెతో సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు రాలేకపోయేవారు. దీనికి కారణం భాష అని గమనించిన దివ్య ఓ ట్యూటర్ ను పెట్టుకొని గోండు భాష నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్రజలతో మమేకమైపోయారు. ఇలా దివ్య దేవరాజన్ నిత్యం ప్రజలల్లో ఉంటూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడ్డారు. తాజాగా కొత్త సంవత్సరం సందర్బంగా దివ్య తీసుకున్న నిర్ణయం పై అంతా ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ దివ్యకు అంతా అభినందనలు తెలియజేశారు. 

ఈ కలెక్టరమ్మకు గతంలో పిట్టకూర తెచ్చి ఇచ్చారు