కలెక్టరంటే ఐఏఎస్ అధికారులు.! వాళ్ళని పార్టీ నాయకుల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారా.? ఈ ప్రశ్న ఎందుకు తెరపైకొస్తోందంటే, ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి తిట్టాలంటూ ఐఏఎస్ అధికారులకు (కలెక్టర్లకు) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచిస్తున్నారు మరి.
రాజకీయాల్లో విమర్శలు సహజం. మీడియా, విపక్షాలూ ఒక్క మాట మీద నిలబడి, ప్రభుత్వంలో వున్నవారిపై దుష్ప్రచారం చేయడం అనేది కొత్త విషయం కాదు. అందుకే, ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ చేసుకుంటుంటుంది తాము చేస్తున్న మంచి పనులకు సంబంధించి.
మంత్రులెలాగూ విపక్షాల విమర్శల్ని, మీడియా నుంచి జరిగే దుష్ప్రచారాల్ని ఖండిస్తుంటారు. వైసీపీకి సొంతంగా మీడియా సంస్థలున్నాయ్. చాలా మీడియా సంస్థల్ని వైసీపీ తమ గుప్పిట్లో పెట్టుకుంది. టీడీపీ అనుకూల మీడియా ఎలా వుందో, వైసీపీ అనుకూల మీడియా కూడా అలాగే వుంది.. ఆ మాటకొస్తే, మరింత బలంగా వుంది కూడా వైసీపీ అనుకూల మీడియా.
తిట్టేందుకు వైసీపీలో చాలామంది నేతలే వున్నారు. కొత్తగా కలెక్టర్లు తిట్లు నేర్చుకుని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టాల్సి వుంటుందా.? ముఖ్యమంత్రి ఇలా ఎందుకు అన్నారు.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశ్యం కావొచ్చు. కానీ, ఆయన ‘తిట్టండి’ అంటూ ఆదేశించారు. ఇదే కొంత ఇబ్బందికరమైన విషయం. అధికారంలో వున్నప్పుడు వాడే భాష మీద చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే, ఇలాగే తప్పుడు సంకేతాలు వెళతాయ్.!