ఈ రాజకీయాన్ని నీలం సాహ్నీ తట్టుకోగలరా.?

neelam sawhney

neelam sawhney

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా చిత్రమైనవి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా చాలా భిన్నమైనవి, జుగుప్సాకరమైనవి ఆంధ్రపదేశ్ రాజకీయాలు. ఏపీలో కుల, మత, ప్రాంతాల పేరుతో రాజకీయాలు నడుస్తుంటాయి. ఇది కొత్త విషయం కాదు, పాత విషయమే. రాష్ట్ర ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ‘కులం ముద్ర’ పడింది. ఎందుకు పడింది.? ఎవరు వేశారు.? అనేది వేరే చర్చ. ఇప్పుడు రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ రాబోతున్నారు. ఆ కొత్త కమిషనర్ ఎవరో కాదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఈ మధ్యనే పదవీ విరమణ చేసి, సలహాదారుగా కొనసాగుతున్న మాజీ ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్ని. తన బాధ్యతల పట్ల పూర్తి నిబద్ధతతో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. అయితే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి అనేది ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో.. అదీ ప్రస్తుత పరిస్థితుల్లో అంత తేలికైన వ్యవహారం కాదు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. బహుశా దేశ చరిత్రలోనే ఆయనలా ఎవరూ ఇంతటి నీఛ రాజకీయాన్ని ఎదుర్కోలేదు. అయితే, స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిపోలేదు. పరిషత్ ఎన్నికలు జరగాల్సి వుంది. కొన్ని మునిసిపాలిటీల్లోనూ ఎన్నికలు జరగాలి. నామినేషన్ల దగ్గర్నుంచి, ప్రచారం, ప్రలోభాలు, ఏకగ్రీవాలు, ఎన్నికలు.. ఇలా ప్రతి అడుగులోనూ రాజకీయ విమర్శలు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీద తప్పవు, వచ్చి పడతాయి. సాధారణ పరిస్థితుల్లో కూడా ఎన్నికల నిర్వహణ అనేది తలకు మించిన భారం. అలాంటిది, ఇప్పుడున్న విభిన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో నీలం సాహ్ని ఎలా నెట్టుకురాగలరన్నది వేచి చూడాల్సి వుంటుంది.