సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం… బొగ్గు లోడింగ్ టబ్ లు పడి కార్మికుడు మృతి!

మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరు ఊహించలేరు. కొన్ని అనుకోని పరిణామాల వల్ల నిమిషాలలో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఇటీవల సింగరేణి బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. సింగరేణి బొగ్గు గనులలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కూడా ఇలాంటి ప్రభావం వల్ల ఒక కార్మికుడు మృతి చెందాడు.

వివరాలలోకి వెళితే…శ్రీరాంపూర్‌కు చెందిన బండారి రాజలింగు(55) అనే వ్యక్తి భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. రాజలింగు సింగరేణి బొగ్గు గనులలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల గురువారం రాజలింగు మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌ ఏరియాలో ఎస్పార్పీ-1 గనిలో రెండవ షిఫ్ట్ విధులకు హాజరయ్యాడు. ఈ క్రమంలో గనిలోని 3 షీం, 7 డీప్‌, 5 లెవల్‌ వద్ద పనిచేస్తుండగా రాత్రి 9 గంటలకు బొగ్గు లోడింగ్‌ టబ్బులు ప్రమాదవశాత్తు రాజలింగు మీద పడ్డాయి.

దీంతో రాజలింగు గట్టిగా కేకలు వేయడంతో తోటి కార్మికులు అతనిని గుర్తించారు. అతని మీద పడిన బొగ్గు టబ్బులను పక్కకు తీసి రాత్రి 11 గంటలకు రామకృష్ణాపూర్ ఏరియాలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే రాజలింగుని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రాజలింగు మరణ వార్త విన్న భార్యా పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబానికి అండగా ఉండాల్సిన వ్యక్తి ఇలా శవమై కనిపించడంతో భార్య రోదన వర్ణాతీతంగా మారింది. రాజలింగు మరణంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజలింగం మరణ వార్త తెలుసుకున్న ఏఐటీయూసీ నాయకుడు వీరభద్రయ్య, కొమురయ్య ఆసుపత్రికి వెళ్లి అతని మృతి పట్ల సంతాపం తెలియజేశారు.