పెద్దల నిర్లక్ష్యానికి బలైన ఒక చిన్నారి నిండు ప్రాణం..?

ఒక్కోసారి తల్లిదండ్రులు తెలియక చేసే పొరపాట్ల వల్ల వారి పిల్లల ప్రాణాల మీదికి వస్తోంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కొమరం భీమ్ జిల్లాలో ఇటువంటి విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆడుతు పాడుతు ఇంట్లోకి వచ్చిన చిన్నారి కూల్ డ్రింక్ సీసాలో ఉన్నది పురుగుల మందు అని తెలియక తాగింది. దీంతో ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా కూడా చిన్నారి ప్రాణాన్ని కాపాడలేకపోయారు.

వివరాలలోకి వెళితే…కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో ఇటీవల ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కొమురం భీం జిల్లా, భీంపూర్ గ్రామానికి చెందిన రాజేశష్, లావణ్య దంపతులు స్థానికంగా గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల వయసున్న శాన్వి అని కుమార్తె ఉంది. చిన్నారి ఇటీవల తమ పెదనాన్న ఇంటి వద్ద ఆడుతూ ఉండగా అక్కడ ఉన్న ఒక కూల్ డ్రింక్ సీసాని గమనించింది. వెంటనే వెళ్లి కూల్ డ్రింక్ అనుకొని ఆ సీసాలో ఉన్న ద్రావణాన్ని తాగేసింది.

అయితే శాన్వి పెదనాన్న పొలంలో పిచికారి చేసే పురుగుల మందు మిగలడంతో ఆ కూల్ డ్రింక్ సీసాలో పోసి అక్కడ ఉంచాడు. ఈ విషయం తెలియని శాన్వి ఆడుతూ వెళ్లి కూల్ డ్రింక్ అని భావించి పురుగుల మందు తాగింది. పురుగుల మందు తాగిన తర్వాత ఇంటికి వెళ్లిన శాన్వి వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆమెను కాగజ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుండి వైద్యులు వేరే ఆసుపత్రికి సిఫార్సు చేశారు. పది ఆస్పత్రులు తిరిగినా కూడా చిన్నారికి చికిత్స అందించకపోవడంతో మార్గం మధ్యలోనే మృతి చెందింది. చిన్నారి శాన్వి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా అర్ధాంతరంగా మరణించడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతంగా మారింది.