మమ్మల్ని తెలంగాణలో కలపండి.. ఐదు గ్రామాల ప్రజలు అలా అన్నారా?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం 5 గ్రామాల గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పిచుకులపాడు, పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం గ్రామ పంచాయితీలు ప్రస్తుతం ఏపీలో ఉండగా ఈ గ్రామాలను తెలంగాణలో కలపాలని తెలంగాణ నేతలు కోరుతున్నారు. ఈ గ్రామాలను తెలంగాణలో కలిపితే గోదావరి వరద ముంపుకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు అయితే ఉంటాయి.

అయితే ఈ గ్రామాల ప్రజలు సైతం ఆయా గ్రామ పంచాయితీలలో శాశ్వత పరిష్కారం కొరకు తెలంగాణలో కలపాలని తీర్మానం చేయడం గమనార్హం. భద్రాచలం ఈ గ్రామాల ప్రజలకు దగ్గరైన ప్రాంతం కావడంతో ఈ గ్రామాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలిపితే బాగుంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల ఈ గ్రామాల ప్రజలు తాము ఎంతో నష్టపోయామని చెబుతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరిన నేపథ్యంలో గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపడం వల్ల తమకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు డిమాండ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం భద్రాచలం జలమయం కావడానికి పోలవరం ఎత్తు పెంచడమే కారణమని చెబుతోంది. బీజేపీ నేత సోము వీర్రాజు మాత్రం పోలవరం అంశానికి సంబంధించి కుట్ర జరిగిందని చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు పోలవరం గురించి మాట్లాడితే తెలంగాణ ఏర్పాటు గురించి ప్రశ్నించడమే అవుతుందని ఆయన కామెంట్లు చేశారు.

రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం, మరో రెండు మండలాలను తెలంగాణకు కేటాయించారని టీఆర్ఎస్ నేతలు మాట మార్చడం సరికాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పాత గాయాలను గెలుకుతున్నట్టు ఉన్నాయని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. సోము వీర్రాజు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.