పొద్దున రెండు.. సాయంత్రం రెండు గంటలు.. మద్యం దుకాణాలు తెరమని కోరుతున్న మహిళలు

కరోనా ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అత్యవసర సర్వీసులు మినహా అన్నీ మూతబడ్డాయి. కూరగాయలు, పండ్లు, సరుకులు వంటి వ్యాపారాలకు ఉదయం పూట సమయం పెట్టి విక్రయిస్తున్నారు.

అయితే లాక్ డౌన్లో భాగంగా బార్లు, వైన్ షాపులు, బెల్ట్ షాపులు, అలాగే కల్లు దుకాణాలు కూడా మూసివేశారు. దీనిపైనే తెలంగాణ నిజామా బాద్ జిల్లాకు చెందిన మహిళలు ఓ వింత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మందు లేక ఇంట్లో మగాళ్లు ఆగం ఆగం చేస్తున్నారు.. అని ఆ మహిళలు వాపోతున్నారు. మందు లేక పోవడంతో ఇంట్లోవాళ్లపై ఆ కోపాన్ని చూపుతున్నారని పేర్కొన్నారు. మగాళ్ల ఆగాన్ని తట్టుకోలేక అల్లాడిపోతున్నామంటూ వాపోతున్నారు. పైగా వారి బాధలన్నిటినీ విడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

కూరగాయలు, సరుకులకు పెట్టినట్లే.. ‘జర పొద్దుగాల రెండు గంటలు.. పొద్దుముఖీ రెండు గంటలు వైన్స్‌ చాలు పెట్టుంచుర్రి సారూ.. మావోళ్లు నమ్మలమయితరు..’ అంటూ ఆ మహిళలు కేసీఆర్‌కు మొరపెట్టుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది.