ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. దీంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నెట్ ఉపయోగించటం తప్పనిసరిగా మారిపోయింది. ఈ ఇంటర్నెట్ వల్ల మానవ జీవన విధానం మరింత సులభతరంగా మారిపోయింది. మనకు తెలియని ప్రతి విషయాన్ని ఇంటర్నెట్ ఉపయోగించి గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా GMail, WhatsApp, YouTube వంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్ మాత్రమే కాకుండా ఫోన్ పే గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు కూడా కేవలం ఇంట్లో కూర్చుని స్మార్ట్ఫోన్ చేతిలో పట్టుకుని జరపవచ్చు. ఈ పనులన్నీ జరగటానికి ఇంటర్నెట్ ఉంటే చాలు.
అయితే ఈ పనులన్నింటికీ ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. ఇలా ఇంటర్నెట్ వాడకం రోజురోజుకీ పెరిగిపోవటంతో దానికి డిమాండ్ పెరిగి ప్రస్తుతం డేటా ప్యాక్ కోసం అధిక మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే ఇంటర్నెట్ డేటా తొందరగా అయిపోతుంది. అలాంటి సమయంలో మనం కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా డేటా సేవ్ చేయవచ్చు. డేటా సేవ్ చేసే ఆ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• డేటా లిమిట్ సెట్ : మొబైల్ లో డేటా సేవ్ చేయటం కోసం మొదటగా చేయవలసిన పని మీ మొబైల్‌లో డేటా పరిమితిని సెట్ చేసుకోవడం . అయితే డేటా లిమిట్ సెట్ చేసుకోవడానికి ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి తర్వాత డేటా లిమిట్, బిల్లింగ్ సైకిల్ ఎంపికపై క్లిక్ చేయండి. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో డేటా లిమిట్ సెట్ చేసుకోవచ్చు. దీంతో 1GB డేటా లిమిట్ సెట్ చేస్తే 1GB డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.
• లోకేషన్ ఆఫ్ : స్మార్ట్ ఫోన్ ఉపయోగించే చాలా మంది లోకేషన్ ఆప్షన్ గురించి పట్టించుకోరు. లోకేషన్ ఫీచర్ ఆన్‌లో ఉండడం వల్ల కూడా ఇంటర్నెట్ డేటా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అవసరమైన సమయాల్లో మాత్రమే లోకేషన్‌ను ఆన్ చేయటం ద్వారా డేటా సేవ్ చేయవచ్చు.
• wifi మోడ్‌లో యాప్‌లు : డేటాన సేవ్ చేయడానికి మొబైల్ డేటా మోడ్ నుంచి Google Playstore లోని అన్ని యాప్‌ల అప్‌డేట్‌ను WiFi మోడ్‌లో ఉంచండి. ఇలా ఈ యాప్‌లను WiFi మోడ్‌లో ఉంచితే ఇది మొబైల్ డేటాను కొంత వరకు ఆదా చేస్తుంది.
• హై క్వాలిటీ వీడియోలు : డేటా సేవ్ చేయడానికి చేయవలసిన మరొక ముఖ్యమైన పని ఏమిటంటే హై క్వాలిటీ వీడియోలను చూడటానికి బదులు నార్మల్ క్వాలిటీతో ప్లే చేయటం. హై క్వాలిటీ వీడియోలను ప్లే చేయడం వల్ల మొబైల్ డేటా చాలా త్వరగా ఖర్చవుతుంది.
• డేటా సేవర్ మోడ్ : మీ స్మార్ట్‌ఫోన్‌లో డేటా సేవర్ మోడ్‌ను ఆన్ చేయటం వల్ల మొబైల్ డేటా సేవ్ చేయవచ్చు. అలాగే మనం తక్కువగా ఉపయోగించే యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా కూడా డేటా సేవ్ చేయవచ్చు.