ఐపీల్-2020: రాజస్థాన్ మీద హైదరాబాద్ సూపర్ విక్టరీ, ప్లేఆఫ్ రేస్ లో హైదరాబాద్

Sunrisers Hyderabad won by 8 wickets on rajastan

ఐపీఎల్-2020, దుబాయ్: ఈ సీజన్‌ లో ప్లేఆఫ్ అవకాశాల్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మనీశ్ పాండే (83 నాటౌట్: 47 బంతుల్లో 4×4, 8×6), విజయ్ శంకర్ (52 నాటౌట్: 51 బంతుల్లో 6×4) హాఫ్ సెంచరీలు బాదడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తాజా సీజన్‌లో 10వ మ్యాచ్‌ ఆడిన హైదరాబాద్‌కి ఇది నాలుగో గెలుపుకాగా.. 11వ మ్యాచ్‌ ఆడిన రాజస్థాన్‌కి ఇది ఏడో ఓటమి.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్… 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ 36, బెన్ స్టోక్స్ 30, రియాన్ పరాగ్ 20, స్మిత్ 19, ఊతప్ప 19 పరుగులు చేశారు. మొదట్లో మంచి జోష్ మీదున్న ఊతప్ప.. 4వ ఓవర్లో అనవసర పరుగుకు వెళ్లి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సామ్సన్.. బెన్‌స్టోక్స్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 12, 13 ఓవర్లలో సామ్సన్, స్టోక్స్ ఔట్ కావడంతో రాజస్థాన్ స్కోర్ నెమ్మదించింది. అనంతరం జోస్ బట్లర్ కూడా ఔట్ అయ్యారు. 19వ ఓవర్లో భారీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి.. హోల్డర్ బౌలింగ్‌లో స్మిత్, రియాన్ పరాగ్ పెవిలియన్ చేరారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో.. జాసన్ హోల్డర్ 3 వికెట్లు పడగొట్టాడు. విజయ్ శంకర్, రషీద్ ఖాన్ చెరో వికెట్ సాధించారు. ఐపీఎల్ 2020లో తొలి మ్యాచ్ ఆడిన హోల్డర్.. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి.. కీలకమైన మూడు వికెట్లు తీశాడు. ఇక నటరాజన్ ఎక్కువ పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లలో ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు.