ఫైనల్లో ఇంకో రెండు రన్స్ చేసి ఉంటే..క్రేజీ రికార్డు మిస్సైన హిట్ మ్యాన్ !

అతడు రికార్డుల రారాజు. గ్రౌండ్‌లోకి అడుగు పెడితే కథ వేరే ఉంటుంది. బౌలర్లకు పట్టపగలే చుక్కల చూపించడం అతడి స్టైల్. అభిమానులు అతడిని హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. ఇప్పటికే అతడెవరే మీకు అర్థమయ్యి ఉంటుంది. యస్ మేము మాట్లాడేది భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గురించే. తాజాగా ఐపీఎల్ 2020 ట్రోఫీని దక్కించుకుని…ముంబై ఏకంగా ఐదుసార్లు టైటిల్‌ గెలిచి చరిత్ర లిఖించేలా చేశాడు రోహిత్. ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్‌లో పలు క్రేజీ రికార్డులు నెలకొల్పిన హిట్ మ్యాన్.. మరో దాన్ని కోల్పోయాడు. పైనల్‌లో 68 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ సారథి..మరో రెండు పరుగలు చేస్తే..ఐపీఎల్‌ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించేవాడు. టీ20 లీగ్‌ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్ ‌(69) 2016లో రికార్డును తన పేరుతో లిఖించుకున్నాడు. ఇప్పటివరకు దాన్ని ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. ఈ సీజన్ ఫైనల్‌లో మరో రెండు రన్స్ చేస్తే..ఆ రికార్డు అందుకునేవాడు. కానీ జస్ట్ మిస్సయ్యాడు.

ఐపీఎల్‌ ఫైనల్లో సారథిగా రోహిత్‌ శర్మ రెండు హాఫ్ సెంచరీలు సాధించి అరుదైన ఘనత అందుకున్నాడు. 2015 సీజన్‌లో కోల్‌కతా వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో రోహిత్‌ 26 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ 2020 ఫైనల్లో మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో కెప్టెన్‌గా రెండు అర్ధ సెంచరీలు సాధించి ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. ఫైనల్లో విజయం అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని కూడా బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించారు. వరల్డ్‌లోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బూర్జ్ ఖలీఫాపై ఓ భారత క్రికెటర్ ఫొటో కనిపించడం ఇదే మొదటిసారి. ఇక కెప్టెన్‌గా ఐదు సార్లు జట్టును గెలిపించిన ఏకైక సారథి రోహిత్ శర్మ. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో 200 మ్యాచ్​లు ఆడిన రెండో ఆటగాడిగా కూడా రోహిత్​ ఘనత సాధించాడు.

ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో నాయకుడిగా తన హుందాతనాన్ని చాటుకున్నాడు. జట్టు సభ్యులను, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. కరోనా సమయంలో ఎన్నో మానసిక ఒత్తిడిలు ఉన్న సమయంలో జట్టు విజయవంతం కావడంతో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని రోహిత్ పేరుపేరున థాంక్స్ చెప్పాడు. అంతటితో ఆగకుండా ఈ ఐపీఎల్ సీజన్‌లో తుది జట్టులో చోటు దక్కని ఆటగాళ్లకు సైతం ధన్యవాదాలు తెలిపాడు.