పాక్ లో ఐపీఎల్ ప్రసారాల పై నిషేధం

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయ వైరం అన్ని రంగాలపై ప్రభావం చూపడం కొత్తేమీ కాదు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి ముఖ్యంగా క్రికెట్ బలవుతూ ఉంటుంది. పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ లీగ్ (పీఎస్ఎల్) ను భారత్ లో ప్రసారం కాకుండా నిషేధం విధించగా, ఇప్పుడు పాక్ అందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ ను పాకిస్థాన్ లో ప్రసారం కాకుండా నిషేధం విధించారు. ఈ మేరకు పాక్ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌధురీ ప్రకటన చేశారు.

క్రీడలపై రాజకీయ ప్రభావం పడకుండా చూడాలని ఎంతో ప్రయత్నించామని, కానీ భారత్ పీఎస్ఎల్ ప్రసారాలపై నిషేధం విధించడంతో తాము కూడా ఐపీఎల్ ప్రసారాలపై నిర్ణయం తీసుకోదలిచామని చౌధురీ స్పష్టం చేశారు. పీఎస్ఎల్ పై నిషేధం విధించిన సమయంలో భారత ప్రభుత్వం, ఇతర సంస్థలు తమపై ఎలాంటి వైఖరి ప్రదర్శించాయో తమకు గుర్తుందని, ఇప్పుడూ ఐపీఎల్ విషయంలో కూడా తమ వైఖరి అలాగే ఉంటుందని అన్నారు.