ఢిల్లీ దుమ్ము దులిపి ఫైనల్‌కు దూసుకెళ్లిన ముంబై జట్టు

Mumbai Indians won by 57 runs

ఐపీఎల్-2020:ముంబయి ఇండియన్స్ ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్‌లో రాణించి.. ఢిల్లీని చిత్తుగా ఓడించింది. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గెలుపుతో ఫైనల్‌కు దూసుకెళ్లింది రోహిత్ సేన. ఐతే ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడనుంది.ఈ సీజన్‌లో అంచనాల్ని అందుకుంటూ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న ముంబయి.. నేరుగా ఫైనల్‌కి దూసుకెళ్లింది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, పొలార్డ్ వంటి సీనియర్లు విఫలమైనా కుర్రాళ్లు అదరగొట్టారు. సూర్య, ఇషాన్, డికాక్, హార్దిక్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేసి.. పరుగుల వరద పారించారు. డెత్ ఓవర్లలో చుక్కలు చూపించారు. ఇషాన్ కిషన్ 55, సూర్యకుమార్ యాదవ్ 51, క్వింటన్ డికాక్ 40, హార్దిక్ పాండ్యా 37 పరుగులు చేశారు. రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్ డకౌట్ అయ్యారు. కృనాల్ పాండ్యా 13 రన్స్ చేశాడు.

వాస్తవానికి ముంబై జట్టుకు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అద్భుతమైన షాట్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఐతే 8వ ఓవర్లలో డికాక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్, సూర్య కుమార్ ఆచితూచి ఆడారు. 12వ ఓవర్లో సూర్య కుమార్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పొలార్డ్.. రెండు బంతులను ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కృనాల్ కూడా ఔట్ కావడంతో.. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా..మెరుపులు మెరిపించాడు. ఇషాన్ కిషన్, హార్దిక్ పోటీ పడి మరీ సిక్స్‌లు కొట్టారు. ఆఖరి ఓవర్లలో ఊచకోత కోసి.. జట్టు స్కోర్‌ను 200లకు చేర్చారు. హార్దిక్ పాండ్యా 14 బంతుల్లోనే 37 రన్స్ చేశాడు. ఇందులో 5 సిక్స్‌లు ఉన్నాయి.

201 పరుగుల లక్ష్యఛేదనని ఢిల్లీ క్యాపిటల్స్ పేలవంగా ఆరంభించింది. తొలి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఓపెనర్ పృథ్వీ షా (0), అనంతరం వచ్చిన అజింక్య రహానె (0) వికెట్లు చేజార్చుకోగా.. రెండో ఓవర్ వేసిన బుమ్రా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (0)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో.. 0/3తో నిలిచిన ఢిల్లీ కోలుకోలేకపోయింది. కాసేపు క్రీజులో నిలిచిన శ్రేయాస్ అయ్యర్ (12: 8 బంతుల్లో) కూడా బుమ్రా బౌలింగ్‌లో బోల్తా కొట్టగా.. రిషబ్ పంత్ (3) పేలవ ఫామ్‌ని కొనసాగించాడు. దాంతో.. 7.5 ఓవర్లు ముగిసే సమయానికి 41/5 నిలిచిన ఢిల్లీ ఓటమి దాదాపు ఖాయమైపోయింది. కానీ.. స్టాయినిస్ – అక్షర్ పటేల్ జోడీ కాసేపు ముంబయి బౌలర్లని ఎదుర్కొని ఆరో వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మళ్లీ ఢిల్లీ శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే.. మళ్లీ 16వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన బుమ్రా తొలి బంతికే స్టాయినిస్‌ని క్లీన్ బౌల్డ్ చేయడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది. ఆఖరి ఓవర్‌లో అక్షర్ పటేల్ కూడా ఔటైపోయాడు.57 పరుగుల భారీ తేడాతో ఢిల్లీ ఓడిపోయింది.