చేతులెత్తేసిన ఢిల్లీ క్యాపిటల్స్ … మరోసారి ఐపీయల్ ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్

Mumbai Indians won by 5 wickets
Mumbai Indians won by 5 wickets
Mumbai Indians won by 5 wickets

IPL-2020 ఫైనల్ మ్యాచ్ : ఢిల్లీపై ముంబై ఇండియన్స్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి నుంచీ ఆఖరు వరకు దూకుడు కొనసాగించింది. ఇటు బ్యాట్.. అటు బాల్‌తో రాణించి.. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలిసారి ఫైనల్‌కు వచ్చిన ఢిల్లీని ఓడించి… ఛాంపియన్ హోదాను నిలబెట్టుకుంది ముంబై. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి సత్తా చాటింది. ఐపీఎల్‌లో తమకు ఎదురే లేదని మరోసారి నిరూపించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది రోహిత్ సేన.

ఢిల్లీ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లో ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 51 బంతుల్లో 68 పరుగులు చేశాడు హిట్ మ్యాన్. ఇషాన్ కిషన్ 30 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. డికాక్ 20, సూర్యకుమార్ యాదవ్ 19, పొలార్డ్ 9 రన్స్ చేశారు.

లక్ష్య ఛేదనలో ఢిల్లీకి మంచి శుభారంభమే లభించింది. డికాక్, రోహిత్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద పారించారు. ఐతే ఐదో ఓవర్‌లో డికాక్ ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన సూర్యతో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ధాటిగా ఆడుతూ.. ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం అందించారు. 11 ఓవర్లో సూర్య ఔటయినప్పటికీ.. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. కెప్టెన్ రోహిత్‌కు చక్కని సహకారం అందించాడు. రోహిత్ శర్మ 68 పరుగులు చేసిన తర్వాత 17వ ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. వరుస ఓవర్లలో పొలార్డ్, హార్దిక్ పాండ్యా ఔటయ్యారు. ఐతే వికెట్లు పడినప్పటికీ.. లక్ష్యం చాలా తక్కువగా ఉండడంతో..ముంబై చాలా ఈజీగా గెలిచింది. కాగా, ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నార్జీ రెండు వికెట్లు తీశాడు. రబడ, మార్కుస్ స్టోయినిస్ తలో వికెట్ పడగొట్టారు.

టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 64 (50 బంతుల్లో), రిషభ్ పంత్ 56 (38 బంతుల్లో) రన్స్ చేశారు. స్టోయినిస్ 0, ధావన్ 15, రహానే 2, హెట్‌మెయిర్ 5, అక్షర్ పటేల్ 9 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. ఢిల్లీ టీమ్..ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇబ్బందులు పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ మార్కుస్ స్టోయినిస్ తొలి ఓవర్ తొలి బంతికే ఔట్ అయ్యాడు. క్వాలిఫైయర్-2లో అద్భుతంగా ఆడిన అతడు.. ఈ మ్యాచ్‌లో మాత్రం అట్టర్ ఫ్లాపయ్యాడు.