ఐపీయల్-2020: రాజస్థాన్ ఇంటికి పయనం… చావు రేవో మ్యాచ్ లో విజయం కోలకతా ని వరించింది

Kolkata Knight Riders won by 60 runs

IPL,దుబాయ్ : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టి.. రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. తమ ప్లేఆఫ్ అవకాశాలను నిలబెట్టుకోవడంతో పాటు.. రాజస్థాన్‌ టీమ్‌ను టోర్నీ నుంచి ఇంటికి పంపించింది కోల్‌కతా. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఏకంగా నాలుగో స్థానానికి వచ్చింది.

దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలింగ్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో తేలిపోయిన రాజస్థాన్‌పై 60 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అలవోక విజయాన్ని అందుకుంది. దాంతో.. 14 మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఏడో విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా.. ఎనిమిదో ఓటమితో పట్టికలో చిట్టచివరి స్థానానికి రాజస్థాన్ పడిపోయింది. రెండు జట్లకీ లీగ్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్‌కాగా.. రాజస్థాన్ ఇంటికి వెళ్లిపోనుంది. కోల్‌కతా ప్లేఆఫ్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ.. ఆ జట్టు ప్లేఆఫ్‌కి చేరాలంటే మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవాలి.

మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయార్ మోర్గాన్ సిక్స్‌ల మోత మోగించాడు. 38 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. శుభమాన్ గిల్ (36), రాహుల్ త్రిపాఠి (39), ఆండ్రే రస్సెల్ (25) పరవా లేదనిపించారు. నితీష్ రాణా (0), సునీల్ నరైన్ (0), దినేష్ కార్తీక్ (0) ప్యాట్ కమ్మిన్స్ (15) రాణించలేదు. కోల్‌కతా జట్టు.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది. మొదటి ఓవర్లోనే నితీష్ రాణా డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి.. శుభమాన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. రెండో వికెట్‌కు వీరిద్దరు కలిసి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఐతే తొమ్మిదో ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది కేకేఆర్. తెవాటియా బౌలింగ్‌లో శుభమాన్ గిల్, నరైన్ ఔటయ్యారు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే త్రిపాఠి, కార్తీక్ ఫెవిలియన్ చేరారు. ఐతే రస్సెల్, మోర్గాన్ 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మళ్లీ రెండు వికెట్లు పడినా.. ఇయాన్ మోర్గాన్ మాత్రం ధాటిగా ఆడుతూ.. జట్టుకు భారీ స్కోర్ అందించాడు. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు వికెట్లు పడగొట్టాడు. కార్తీక్ త్యాగి 2, శ్రేయాస్ గోపాల్ 1, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ తీశారు.

https://twitter.com/IPL/status/1322973980664365057

192 పరుగుల లక్ష్య ఛేదనలో మొదటి ఓవర్ మినహా.. ఏ దశలోనూ రాజస్థాన్ గెలిచేలా కనిపించలేదు. తొలి ఓవర్ వేసిన పాట్ కమిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడేసిన ఓపెనర్లు బెన్‌స్టోక్స్ (18: 11 బంతుల్లో 2×4, 1×6), రాబిన్ ఉతప్ప (6: 2 బంతుల్లో 1×6) ఏకంగా 19 పరుగుల్ని పిండుకున్నారు. కానీ.. ఆ ఓవర్‌లో ఆఖరి బంతికి ఉతప్ప ఔటవగా.. మూడో ఓవర్‌లో బెన్‌స్టోక్స్ వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. ఒత్తిడికి గురైన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌లు స్టీవ్‌స్మిత్ (4), సంజు శాంసన్ (1), రియాన్ పరాగ్ (0) తక్కువ స్కోరుకే ఔటైపోగా..జోస్ బట్లర్ (35: 22 బంతుల్లో 4×4, 1×6), రాహుల్ తెవాటియా (31: 27 బంతుల్లో 2×4, 1×6) జోడీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. కానీ.. బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోవడంతో సాహసోపేత షాట్లు ఆడక తప్పలేదు. ఈ క్రమంలో ఇద్దరూ వికెట్లు చేజార్చుకోగా.. ఆఖర్లో శ్రేయాస్ గోపాల్ (23: 23 బంతుల్లో 2×4) నిలకడగా ఆడి రాజస్థాన్ ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించాడు. కోల్‌కతా బౌలర్లలో పాట్ కమిన్స్ 4 వికెట్లు పడగొట్టగా.. శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు, నాగర్‌కోటికి ఒక వికెట్‌ దక్కింది.