IPL 2025: సన్‌రైజర్స్ దెబ్బకి LSG కి బిగ్ షాక్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సోమవారం రాత్రి ఓ కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని నమోదు చేసింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలవడంతో ఢిల్లీకి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచే అవకాశాన్ని ఈజీ చేసేసింది. మరోవైపు ఈ ఓటమితో లఖ్‌నవూ సీజన్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పినట్టయింది. 12 మ్యాచుల్లో ఇది ఏడో పరాజయం కావడం గమనార్హం.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్‌లో మిచెల్ మార్ష్ (65: 39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్‌క్రమ్ (61: 38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (45: 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు.

కానీ మిగిలిన వారు మెరుగైన మద్దతు ఇవ్వకపోవడంతో భారీ స్కోరు దిశగా వెళ్లలేకపోయారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2 వికెట్లు తీయగా, కమిన్స్, హర్ష్ దూబె, నితీశ్ రెడ్డి, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. 206 పరుగుల ఛేజింగ్‌లో హైదరాబాద్ జట్టుకు అభిషేక్ శర్మ పవర్‌ఫుల్ ఆరంభం ఇచ్చాడు. అతను కేవలం 20 బంతుల్లో 59 పరుగులు (4 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో ఆకట్టుకున్నాడు.

ఇషాన్ కిషన్ (35: 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెన్రిచ్ క్లాసెన్ (47: 27 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) నిలకడగా ఆడి జట్టు విజయానికి బాట వేసారు. కమిందు మెండిస్ (32; రిటైర్డ్ హర్ట్), అథర్వ తైడే (13), నితీశ్ రెడ్డి (5*) సహకరించారు. లఖ్‌నవూ బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ 2 వికెట్లు తీయగా, ఓ రూర్క్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. ఈ విజయం సన్‌రైజర్స్‌కు నాలుగో గెలుపు కాగా, ప్లే ఆఫ్స్ ఆశలు లేకపోయినా పరువు దక్కించుకుంది. ఇక లఖ్‌నవూ మాత్రం లీగ్ దశ ముగిసే లోపే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.