ఐపీయల్ -2020: MI vs KXIP మ్యాచ్ క్రికెట్ అభిమానులకి ఫుల్ మజాని అందించింది..ముంబై మీద అత్యంత నాటకీయంగా పంజాబ్ గెలిచింది

Kings XI Punjab won on second Super Over
ఐపీయల్ -2020
ఐపీయల్ -2020: MI vs KXIP

దుబాయ్: ఆదివారం జరిగిన రెండు మ్యాచ్ లు కూడాను సూపర్ ఓవర్లులోనే ఫలితాలని అందుకున్నాయి.ఇక రెండో మ్యాచ్ అయితే సూపరో సూపరు అన్నట్లుగా జరిగి క్రికెట్’ అభిమానులకి కొత్త అనుభూతిని మిగిల్చింది.సూపర్ ఓవర్ లో టైడ్ అయ్యి డబల్ సూపర్ ఓవర్ కి వెళ్లి ముంబై మీద పంజాబ్ ఎట్టకేలకు గెలిచి ప్లేఆఫ్ అవకాశాలని మెరుగు పరుచుకుంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53)హాఫ్ సెంచరీకి తోడు చివర్లో కీరన్ పొలార్డ్(12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్), కౌల్టర్ నీల్ (12 బంతుల్లో 4 ఫోర్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో షమీ, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులే చేసింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు.

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ పంజాబ్‌కు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(11) బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్ట్ అయ్యాడు. మరోవైపు క్రీజులోకి వచ్చిన గేల్‌తో కెప్టెన్ కేఎల్ రాహుల్ ధాటిగా ఆడాడు. దాంతో పంజాబ్ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 61 రన్స్ చేసింది. అయితే రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన గేల్(24)ను రాహుల్ చాహర్ అద్భుత బౌలింగ్‌తో బోల్తా కొట్టించాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన బంతిని గేల్ భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత పూరన్ కూడా 2 సిక్స్ 2 ఫోర్లతో దూకుడుగా ఆడాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో భారీషాట్ ఆడిన పూరన్.. కౌల్టర్ నీల్‌కు క్యాచ్ ఇచ్చి పెవలియన్ చేరాడు. ఆ వెంటనే మ్యాక్స్‌వెల్ చాహర్ బౌలింగ్‌లో సిల్వర్ డక్‌గా తన వైఫల్యాన్ని కొనసాగించాడు. ఓవైపు వికెట్లు పడుతున్న మరోవైపు రాహుల్ ధాటిగా ఆడటంతో పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 27 రన్స్ అవసరమయ్యాయి. అయితే బుమ్రా రాహుల్‌ను ఔట్ చేసి మ్యాచ్ ముంబై వైపు తిప్పాడు. అద్బుత యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు.

దాంతో ఈ ఓవర్‌లో 5 పరుగులే వచ్చాయి. 19వ ఓవర్‌లో దీపక్ హూడా ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ చాహర్ చేజార్చాడు. ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు రావడంతో ఆఖరి ఓవర్‌లో పంజాబ్ గెలుపుకు 9 రన్స్ అవసరమయ్యాయి. అయితే బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్‌లో బౌండరీతో సహా 8 రన్స్ రావడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది.

Kings XI Punjab won on second Super Over
Kings XI Punjab won on second Super Over

తొలి సూపర్ ఓవర్ టైగా…

డెత్ బౌలర్ల స్పెషలిస్ట్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా సూపర్ ఓవర్‌లో రెండో బంతికి పూరన్ క్యాచ్ ఔటవ్వగా.. ఆఖరి బంతికి కేఎల్ రాహుల్ ఎల్బీ అయ్యాడు. అయితే ఒక్క బౌండరీ కూడా రాకపోవడంతో ముంబై ముందు 6 పరుగుల లక్ష్యం నమోదైంది. ఇక షమీ వేసిన సూపర్ ఓవర్‌లో రోహిత్-డికాక్ నాలుగు బంతుల్లో మూడు పరుగులు చేయడంతో ఉత్కంఠతను రేకెత్తించింది. ఇక ఆఖరి బంతికి ముంబై విజయానికి రెండు రన్స్ అవసరమయ్యాయి. అయితే డికాక్ డబుల్ తీసే ప్రయత్నంలోరనౌట్ కావడంతో మరోసారి టై అయింది.

రెండో సూపర్ ఓవర్ …

బంధనల ప్రకారం తొలి సూపర్ ఓవర్ ఆడిన బ్యాట్స్‌మన్‌, బౌలర్‌కు మళ్లీ ఆడే అవకాశం లేకపోవడంతో పొలార్డ్, పాండ్యా సెకండ్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగగా..పంజాబ్ తరఫున క్రిస్ జోర్డాన్ బంతిని అందుకున్నాడు. రెండు వైడ్లు, ఒక ఫోర్‌, మూడు సింగిల్స్‌, ఒక డబుల్‌తో కలిపి 11 పరుగులు వచ్చాయి. హర్దిక్ పాండ్యా రనౌట్ కాగా.. ఆఖరి బంతికి పొలార్డ్ భారీ షాట్ ఆడగా మయాంక్ అగర్వాల్ సూపర్ ఫీల్డింగ్‌తో నాలుగు పరుగులు సేవ్ చేశాడు.

ఇక 12 రన్స్ లక్ష్యంతో క్రిస్ గేల్, మయాంక్ క్రీజులోకి రాగా.. ట్రెంట్ బౌల్ట్ బంతిని అందుకున్నాడు. అయితే ఫస్ట్ బాల్‌నే గేల్ భారీ సిక్సర్ కొట్టాడు. మరుసటి బంతికి గేల్ సింగిల్ తీయగా.. మయాంక్ అగర్వాల్ ఫోర్ కొట్టడంతో స్కోర్ టై అయింది. దాంతో చివరి మూడు బంతుల్లో పంజాబ్ విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా మయాంక్ మరో ఫోర్ కొట్టడంతో పంజాబ్ గెలిచింది.