IPL 2020 : సన్‌రైజర్స్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ.. ఇలా అయితే కష్టమే

షార్జా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మరో షాక్‌. తొలి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఓటమి చవిచూసిన వార్నర్‌ సేనకు మరో మింగుపడని వార్త. సన్‌రైజర్స్‌ జట్టులో కీలక ఆటగాడు, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ టోర్నీ మొత్తానికే దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మార్ష్‌ గాయపడిన విషయం తెలిసిందే. అ గాయం తీవ్రమైనది కావడంతో రెండు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు అనధికారిక సమచారం.

Sunrisers Hyderabad Player Mitchel Marsh May Be Ruled Out
Sunrisers Hyderabad Player Mitchel Marsh May Be Ruled Out

దీంతో అతడి స్థానంలో డానియల్‌ క్రిస్టియన్‌తో సన్‌రైజర్స్‌ ఒప్పందం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మార్ష్‌ గాయంపై, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై సన్‌రైజర్స్‌ ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి. ఇక బెంగళూరుతో జరగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తున్న సమయంలో మార్ష్‌ గాయపడ్డాడు. ఆరోన్‌ ఫించ్‌ ఆడిన షాట్‌ను ఆపబోయి గాయపడిన మార్ష్‌ మరో రెండు బంతులు మాత్రమే వేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత కుంటుకుంటూనే బ్యాటింగ్‌కు వచ్చి తొలి బంతికే అవుటయ్యాడు. అతని చీలమండ గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలిసింది.

మరోవైపు కేన్‌ విలియమ్సన్‌ కూడా తొడ గాయంతో బాధపడుతున్నాడు. అందుకే అతడు తొలి మ్యాచ్‌కు దూరం కావాల్సి వచ్చింది. విలియమ్సన్‌ ఎప్పటివరకు కోలుకుంటాడనే విషయంలో ఎలాంటి సమాచారం లేదు. ఇలా స్టార్‌ విదేశీ ఆటగాళ్లు వరుసగా గాయాలపాలవుతుండటం సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌కు, అభిమానులకు మింగుడుపడటం లేదు. అయితే తర్వాతి మ్యాచ్‌కు విలియమ్సన్‌ అందుబాటులోకి వచ్చి ఓ గెలుపు రుచిచూస్తే అన్ని సర్దు కుంటాయని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.