IPL 2020: ముంబై మాస్టర్‌ ప్లాన్‌.. పాపం పంజాబ్‌

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌)-2020లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ అసలు సిసలైన చాంపియన్‌ ఆటను ప్రదర్శించింది. అబుదాబి వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ సేనపై ముంబై 48 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.

సారథి రోహిత్‌ శర్మ(45 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరో వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడగా.. చివర్లో ముంబై విధ్వంసకర ఆటగాడు పొలార్డ్‌ (20 బంతుల్లో 47 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (11 బంతుల్లో 30 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ముంబై భారీ స్కోర్‌ సాధించింది. ఇక వీరిద్దరు ధాటిగా ఆడటంతో చివరి ఐదు ఓవర్లలో ముంబై 89 పరుగులు పిండుకుంది.

అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ ఏ క్రమంలోనూ గెలుపు వైపు పయనించలేదు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాటు వరుస క్రమంలో వికెట్లు పడగొట్టి పంజాబ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఒత్తిడికి చిత్తయిన పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ చేజేతులా వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగిన పంజాబ్‌ ఓటమిచవిచూసింది.

పంజాబ్‌ ఆటగాళ్లలో నికోలస్‌ పూరన్‌ (27 బంతుల్లో 44) మినహా ఎవరూ గొప్పగా బ్యాటింగ్‌ చేయలేదు. ముంబై బౌలర్లలో రాహుల్‌ చహర్‌, బుమ్రా, ప్యాటిన్సన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై గేమ్‌ ప్లాన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. బ్యాటింగ్‌ చేసే క్రమంలో చివరి ఓవర్ల వరకు వేచి చూడటం, రోహిత్‌ ఔట్‌ కాకుండా క్రీజులో నిలదొక్కుకోవడం, బౌలింగ్‌ సమయంలోను పంజాబ్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మన్‌కు ఎవరి చేత బౌలింగ్‌ చేయాలనేదానిపై పక్కా ప్రణాళికలు రచించుకున్న ముంబై వాటిని సక్రమంగా అమలు చేసి ఘన విజయాన్ని అందుకుంది.