ఆఫ్రిది రికార్డ్‌కు బ్రేక్.. సిక్సుల సుల్తాన్ గా రోహిత్ శర్మ చరిత్ర..!

రాంచీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సత్తా చాటాడు. ఇప్పటివరకు వన్డేల్లో షాహిద్ ఆఫ్రిది పేరిట ఉన్న 351 సిక్సుల ప్రపంచ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ కొట్టిన సిక్స్‌తో అతని వన్డే సిక్సుల సంఖ్య 352కి చేరింది. దీంతో ‘బూమ్ బూమ్’ ఆఫ్రిది రికార్డు ఇప్పుడు అధికారికంగా ‘హిట్‌మాన్’ ఖాతాలోకి వెళ్లిపోయింది.

269 వన్డే ఇన్నింగ్స్‌లు.. 352 సిక్సులు.. ఈ గణాంకాలే రోహిత్ బ్యాటింగ్ పవర్‌ను చాటిచెబుతున్నాయి. బంతి ఎటు పడుతుందో ముందే అంచనా వేసే టైమింగ్, శక్తివంతమైన షాట్లు, ఇవన్నీ కలిసి రోహిత్‌ను సిక్సుల సామ్రాట్‌గా మలిచాయి. టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పిన తర్వాత రోహిత్ ఇప్పుడు పూర్తిగా వన్డేలపై దృష్టిపెట్టాడు. ఒక్క లక్ష్యమే ముందున్నట్లు కనిపిస్తోంది.. 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచకప్. అందుకే ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. బరువు తగ్గి, స్లిమ్‌గా మారి, మళ్లీ కెరీర్ రెండో దశలోకి అడుగుపెట్టినట్లుగా కనిపిస్తున్నాడు.

ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టూర్‌లోనూ రోహిత్ బ్యాట్ తో అదరగొట్టారు. వయసు పెరుగుతున్నా, తనలో పరుగుల ఆకలి ఏమాత్రం తగ్గలేదని ప్రతి మ్యాచ్‌తో నిరూపిస్తున్నాడు. అనుభవం, ప్రశాంతత, టైమింగ్ ఈ మూడు కలిసిన వ్యక్తే రోహిత్ శర్మే అని మరోసారి రుజువైంది.