IPL 2020: రోహిత్‌ శర్మకు షాకిచ్చిన మ్యాక్స్‌వెల్‌-నీషమ్‌

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020లో భాగంగా గురువారం డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఫీల్డర్లు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, జేమ్స్‌ నీషమ్‌లు మహా అద్భుతాన్ని చేశారు. జోరు మీదున్న ముంబై సారథి, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను కళ్లు చెదిరే రీతిలో అందుకున్నారు. షమీ వేసిన 17వ ఓవర్‌ తొలి బంతిని లాంగాఫ్‌ దిశగా సిక్సర్‌ కొట్టే ప్రయత్నం చేశాడు.

అయితే అక్కడే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న మ్యాక్స్‌వెల్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్నాడు. కానీ బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్‌ దాటి వెళ్తానని గ్రహించాడు.. సమయస్ఫూర్తితో వ్యవహరించి బంతిని పక్కనే ఉన్న ఫీల్డర్ నీషమ్ వైపు విసిరాడు. మ్యాక్స్‌వెల్ బౌండరీ లైన్ దాటగా.. బంతిని నీషమ్ అందుకున్నాడు. దీంతో షాక్‌కు గురైన రోహిత్ శర్మ (45 బంతుల్లో 70) భారంగా క్రీజు వదిలి వెళ్లాడు.

ఇక ఐపీఎల్‌-13లో అద్భుత క్యాచ్‌ల జాబితాలో ఇది చేరడం ఖాయమని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. మ్యాక్స్‌వెల్‌ అద్భుత ఫీల్డింగ్‌కు, సమయస్పూర్థికి నెటిజన్లు ఫిదా అవడంతో పాటు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక జాంటీ రోడ్స్‌ పంజాబ్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ఆ జట్టులో ఫీల్డింగ్‌ ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఇదే సీజన్‌లో పంజాబ్‌ ఫీల్డర్‌ నికోలస్‌ పూరన్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ క్యాచ్‌ అందుకోవడం విశేషం.