సుధీర్ఘ విరామం తర్వాత టీమిండియా రసవత్తర పోరుకు సిద్దమైంది. కరోనా వలన దాదాపు 8 నెలలకు దూరంగా ఉన్న క్రికెటర్స్ ఐపీఎల్‌తో మళ్ళీ బాల్, బ్యాట్ చేతపట్టారు. ఐపీఎల్ పూర్తిగా బయోబబుల్ వాతావరణంలో జరగగా, ఆసీస్- ఇండియా సిరీస్ 50 శాతం ప్రేక్షకుల మధ్య సాగనుంది. ఈ రోజు సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా- ఇండియా తొలి వన్డే మ్యాచ్ ఆడగా టాస్ గెలిచిన ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి బాల్ నుండి దూకుడిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోరు చేసింది. వీరిలో ఫించ్(114;124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్(105; 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్(69; 76 బంతుల్లో 6 ఫోర్లు)లతో అదరగొట్టారు.
ఇక 375 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మొదట్లో స్ట్రాంగ్‌గానే కనిపించింది. మయాంక, శిఖర్ దావన్‌లు వికెట్ కోల్పోకుండా 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గేమ్ మంచిగా సాగుతున్న తరుణంలో హాజిల్ వుడ్.. మయాంక్(22)ని పెవిలియన్‌కు పంపాడు. ఇక శిఖర్ ధావన్‌తో జతకట్టిన కోహ్లీ మొదట్లో లైఫ్ అందుకున్నాడు. కాని దాన్ని చక్కగా వినియోగించుకోలేక పోయిన విరాట్ 22 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యార్, రాహుల్ ఇలా వచ్చి అలా వెళ్లారు.
ఇక క్రీజ్‌లోకి వచ్చిన హార్ధిక్ ప్యాండ్యా టీ 20 స్టైల్‌లో రెచ్చిపోయాడు. హార్ధిక వచ్చాక స్కోర్ బోర్డ్ ఉరకలెత్తింది. 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జంపా వేసిన 39 ఓవర్ ఐదో బంతికి స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ ఔటయ్యాడు. దాంతో టీమిండియా 247 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఇక వెంటనే శిఖర్ ధావన్ (74)కూడా పెవీలియన్ చేరాడు. చివరలో జడేజా, సైనీలు కాస్త మెరుపులు మెరిపించడంతో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
బౌలర్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ 55 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా.. స్పిన్నర్ ఆడమ్ జంపా 54 పరగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లలో షమీ 59 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీశారు. రెండో వన్డే సిడ్నీ వేదికగా ఆదివారం జరగనుంది.