Tilak Varma – Hardik Pandya: తిలక్ హిట్.. హార్దిక్ ఫైట్.. అయినా ముంబయి చేతులెత్తేసింది!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు మరో ఘోర ఓటమి ఎదురైంది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో ముంబయి జట్టు 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమై పరాజయం చవిచూసింది.

చివరి వరకూ మ్యాచ్‌లోకి పోటీనిచ్చినా ముంబయి బ్యాటర్లు కీలక సమయాల్లో తడబడ్డారు. తిలక్ వర్మ 29 బంతుల్లో 56 (4 ఫోర్లు, 4 సిక్సులు), హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 42 (3 ఫోర్లు, 4 సిక్సులు)తో మెరిపించగా… మిగతా బ్యాటర్లు సాధారణంగానే ఆడారు. సూర్యకుమార్ యాదవ్ 28, రోహిత్ శర్మ 17, రికెల్టన్ 17 పరుగులతో నిలిచారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా 4 వికెట్లు తీసి ముంబయిని చిత్తుచేశాడు. యశ్ దయాళ్, హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీసినప్పటికీ, కీలక సమయాల్లో వారి బౌలింగ్ ఆకట్టుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 67 (8 ఫోర్లు, 2 సిక్సులు), రజత్ పటీదార్ 32 బంతుల్లో 64 (5 ఫోర్లు, 4 సిక్సులు)తో ధనాధన్ షాట్లు ఆడారు. జితేశ్ శర్మ చివర్లో 19 బంతుల్లో 40 పరుగులు (2 ఫోర్లు, 4 సిక్సులు)తో విధ్వంసం సృష్టించాడు. దేవ్‌దత్ పడిక్కల్ 22 బంతుల్లో 37 పరుగులు చేసి ఆదిలోనే ముంబయికి దెబ్బ తగిలించాడు. ముంబయి బౌలర్లలో హార్దిక్, బౌల్ట్ చెరో రెండు వికెట్లు, పుతుర్ ఒక వికెట్ తీశారు.

చివరి మూడు ఓవర్లలో గేమ్‌ను ఫినిష్ చేయాల్సిన ముంబయి… తడబడింది. హార్దిక్ ఔట్ అయిన 18వ ఓవర్‌ తర్వాత నుంచి స్కోరు వేగం మందగించింది. దీంతో ముంబయికి చేజారిన గేమ్‌పై అభిమానుల నిరాశ వ్యక్తమవుతోంది. విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది.