కంగారూల గడ్డపై భారత బౌలర్స్ నిప్పులు చెరుగుతూ బంతులు వేస్తున్నారు. భారత బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ గజగజ వణికిపోయారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(4/55) , బుమ్రా(2/52), ఉమేశ్ యాదవ్(3/40) చెలరేగిపోవడంతో ఆస్ట్రేలియా 72.1 ఓవర్లలో 191 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో భారత్ కు 53 పరుగుల ఆధిక్యం లభించింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 244 రన్స్‌కు ఆలౌటైన సంగతి తెలిసిందే.
శుక్రవారం ఉదయం ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వెంటవెంటనే వికెట్స్ కోల్పోయింది. అశ్విన్, సాహా, ఉమేష్, యాదవ్, షమీ ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టారు. దీంతో 244 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. అనంతరం ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌కు బుమ్రా, ఉమేష్‌లు చుక్కలు చూపించారు. క్రీజు నుండి కదలనివ్వకుండా బంతులు సంధించారు. 29 పరుగులకే ఓపెనర్లు మాథ్యూ వేడ్(8), జో బర్న్స్(8) ఔటవడంతో క్రీజులోకి వచ్చిన లబుషేన్(47) కుదురుకునేందుకు చాలా ప్రయత్నిచాడు. మనోళ్ళు మూడు క్యాచ్‌లు జారవిడవడంతో ఆ స్కోరు సాధించగలిచాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో లబుషేన్ ఔట్ కాగా, అదే ఓవర్‌లో కమిన్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు
పరిమిత ఓవర్లలో అదరగొట్టిన స్టీవ్ స్మిత్‌ను అశ్విన్ తన మాయాజాలంతో పెవీలియన్‌కు పంపాడు. ట్రావిస్ హెడ్(7) కూడా అశ్విన్‌కు దొరికిపోయాడు. ఇక కెప్టెన్ పైన్ క్యాచ్ మనోళ్ళు జారవిడవడంతో ఒంటరి పోరు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చివరి వికెట్ ఉమేష్ యాదవ్‌కు దక్కగా, ఆస్ట్రేలియా 191 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్‌కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన పృథ్వీ షా రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి కమ్మిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అనంతరం నైట్ వాచ్‌మెన్‌గా బుమ్రా వచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేయగా, 62 పరుగుల ఆధిక్యం సాధించింది.