వచ్చే ఏడాది నిర్వహించబోయే టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీని ఆస్ట్రేలియాలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అదే ఏడాది, అదే దేశంలోనే మహిళల టీ20 ప్రపంచకప్‌ను కూడా నిర్వహిస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది అక్టోబర్ 18వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడతారు.
టీ20 ప్రపంచకప్ కోసం 16 జట్లు పోటీ పడతాయి. మొత్తం 45 మ్యాచ్‌లు ఉంటాయి. పెర్త్, బ్రిస్‌బేన్, అడిలైడ్, జీలాంగ్, మెల్‌బోర్న్, సిడ్నీ, హోబర్ట్ స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఈ సారి ఐసీసీ టీ20 ర్యాంకింగ్‌లల్లో పాకిస్తాన్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తరువాత వరుసగా భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్, వెస్టిండీస్, అఫ్ఘానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ర్యాంకింగ్ జాబితాలో ఉన్నాయి.
16 జట్లను రెండు పూల్‌గా విభజించారు. పూల్-ఎలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, వెస్టిండీస్ తలపడగా.. పూల్-బీలో భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అప్ఘానిస్తాన్‌లకు చోటు కల్పించారు. మహిళల టీ20 మ్యాచ్‌లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వ తేదీ వరకు కొనసాగుతాయి.