పొట్టి క్రికెట్ యుద్దం ఐపీఎల్-2020 ముగిసింది. ఈ క్రమంలో మంచి ప్రదర్శన చేసిన ప్లేయర్స్‌తో మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తమకు ఇష్టమైన జట్టును ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్ తమ అత్యుత్తమ జట్లను ప్రకటించారు. తాజాగా ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే తను ఎంపిక చేసిన జట్టును ప్రకటించాడు. అయితే ఆశ్చర్యకరంగా హర్ష జట్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మలకు స్థానం దక్కలేదు. ఇంకా విస్మయం కలిగించే విషయం ఏంటంటే ఈ సీజన్‌లో పర్పుల్ క్యాప్ సాధించిన కగిసో రబడాను కూడా భోగ్లే లైట్ తీసుకున్నాడు.
ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథి కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా తీసుకున్న హర్షా..మరో ఓపెనరగా ధావన్‌ను ఎంపిక చేశాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ ఓ శతకంతో కలిపి 670 పరుగులు చేయగా.. గబ్బర్ 17 మ్యాచ్‌ల్లో 2 శతకాలతో 618 పరుగులు చేశాడు. ఇక మూడో స్థానంలో ఈ సీజన్‌లో అద్బుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్‌ను ఎంచుకున్నాడు. నాలుగో స్థానంలో మిస్టర్ 360… ఏబీ డివిలియర్స్‌ను తీసుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో నిలకడైన బ్యాటింగ్‌తో సూర్య ఇండియన్ ఏబీడీగా మాజీలు, సీనియర్ల చేత ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా తన ఆటలో ఏ మాత్రం పస తగ్గలేదని డివిలియర్స్ సత్తా చాటాడు. దాంతో వరసగా మూడు, నాలుగు స్థానాల్లో వారిని పిక్ చేసుకున్నాడు. ఇక ఐదవ స్థానంలో కీరన్ పొలార్డ్‌ను తీసుకున్న భోగ్లే.. ఆరవ స్థానంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటిచ్చాడు. ఈ ఇద్దరు ముంబై ఇండియన్స్ తరఫున ఆడి..ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే.
ఇక రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్బుతంగా రాణించిన జోఫ్రా ఆర్చర్‌ను తీసుకున్న హర్ష.. లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన రబడాను పక్కనపెట్టేయడం గమనార్హం. ఇక పేస్ విషయానికి వస్తే జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను తీసుకున్నాడు. బుమ్రా ముంబై తరఫున అదరగొట్టగగా.. షమీ పంజాబ్ తరఫున దుమ్ములేపాడు. ఇక స్పిన్నర్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్, ఆర్‌సీబీ జట్టు మాంత్రికుడడు యుజ్వేంద్ర చాహల్‌ను ఎంచుకున్నాడు.
హర్షా భోగ్లో ఎన్నుకున్న జట్టు :
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, సూర్య కుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్ (కీపర్), కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, జోఫ్రా ఆర్చర్, రషీద్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్