టీమిండియాకు బిగ్ రిలీఫ్.. గంభీర్ తిరిగి వచ్చేశాడు..!

భారత్‌, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు కొన్ని రోజులే మిగిలి ఉండగా.. టీమ్ఇండియాకు ఊరట కలిగించే ఒక శుభవార్త వచ్చింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మళ్లీ జట్టుతో కలవబోతున్నారు. కుటుంబ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో గంభీర్ గతవారం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. జూన్ 11న ఆయన తల్లి గుండెపోటుతో అస్వస్థతకు గురవడం వల్ల స్వదేశానికి చేరుకున్నారు.

ఇప్పుడు ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో గంభీర్ తిరిగి లండన్‌కి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం ఆయన ఇంగ్లాండ్‌కి వెళ్లి, మంగళవారం నాటికి జట్టుతో మళ్లీ చేరనున్నట్టు సమాచారం. ఈ సమయంలో టీమ్‌ఇండియా ప్రాక్టీస్ సెషన్లకు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలికంగా కోచింగ్ అందిస్తున్నారు. లక్షణ్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంగ్లాండ్ కి వెళ్లారు.. అయితే గంభీర్ అనుకోకుండా ఇండియాకు రావడంతో.. బీసీసీఐ వెంటనే లక్ష్మణ్ సేవలను వినియోగించింది.

ఇంగ్లాండ్ పర్యటన కోసం ఇప్పటికే భారత జట్టు ఎంపిక అయింది. ఇందులో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్నాడు. రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లతో పాటు జడేజా, బుమ్రా, సిరాజ్ వంటి అనుభవజ్ఞులు కూడా చోటు దక్కించుకున్నారు. కేవలం నాలుగు రోజుల్లో టెస్ట్ సిరీస్ ఆరంభంకానున్న వేళ గంభీర్ తిరిగి జట్టులో చేరనుండటంతో ఆటగాళ్లలో కొత్త ఉత్సాహం నెలకొనే అవకాశముంది.