ప్రపంచదేశాలని వణికించిన కరోనా మహమ్మారి వలన ప్రపంచం మొత్తం స్తంభించిన సంగతి తెలిసిందే. ఇలాంటి రోజులు వస్తాయని ఎవరు ఊహించలేదు. కంటికి కనిపించని ఈ వైరస్‌కు భయపడి దాదాపు ఏడు నెలల పాటు అన్ని రంగాలు పూర్తిగా ఆగిపోయాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి, క్రికెట్, టెన్నిస్, ఫుట్ బాల్ లాంటి గేమ్స్ కు బ్రేక్ పడ్డాయి. ప్రయాణాలు పూర్తిగా రద్దయ్యాయి. అయితే బయోబబుల్ వాతావరణంలో క్రికెట్ మ్యాచ్‌లని నిర్వహిస్తూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మ్యాచ్‌లకు ప్రేక్షకులని అనుమతినిస్తున్న, మరి కొన్ని మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి.
గత కొద్ది రోజులుగా సౌతాఫ్రికా- ఇంగ్లండ్ మధ్య ఆసక్తికర మ్యాచ్‌లు సాగుతున్నాయి. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ వైట్‌వాష్ చేయగా, వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. ఆదివారం ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య వన్డే మ్యాచ్ జరగాల్సి ఉండగా, కరోనా వలన ఆగిపోయింది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా టీమ్స్ ఉంటున్న హోటల్‌లో ఇద్దరు సిబ్బందికి కరోనా సోకడం, వారు ఇరు జట్ల ప్లేయర్స్‌కు కాంటాక్ట్ ఉండటంతో నేడు జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ శుక్రవారం జరగాల్సి ఉండగా, సౌతాఫ్రికా టీంలో ఒకరికి కరోనా సోకడంతో మ్యాచ్‌ను ఈ రోజు జరిపించే ప్లాన్ చేశారు.
కేప్‌టౌన్‌లో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను పార్లకు తరలించినప్పటికి మ్యాచ్ రద్ధవడం అభిమానులకి బాధని కలిగించింది. ఆదివారం మ్యాచ్ కోసం శనివారం అందరికి కరోనా పరీక్షలు జరిపించారు. అందరికి నెగెటివ్ రావడంతో సంతోషించారు. అంతకముందు ఈ ఫలితాల కోసం మ్యాచ్‌ని లేట్‌గా ప్రారంభించేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. కాని హోటల్ రూం సిబ్బంది ఇద్దరికి కరోనా రావడంతో ఆదివారం మ్యాచ్‌ని రద్దు చేశారు. సోమవారం, బుధవారం జరగాల్సిన వన్డేలు కూడా కరోనా ఎఫెక్ట్‌తో రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.