లార్డ్స్‌లో అరుదైన ఘనత సాధించిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్..!

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను ఔట్ చేసి, ప్రత్యేక జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఇప్పటి వరకూ లార్డ్స్ వేదికగా ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ను అవుట్ చేసిన మూడో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా కమిన్స్ నిలిచారు.

ఇంతకుముందు ఈ ఘనతను మాంటీ నోబుల్ (1909లో ఆర్చీ మాక్‌లారెన్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లో), ఇయాన్ చాపెల్ (1975లో టోనీ గ్రెగ్‌ను) మాత్రమే సాధించారు. ఇప్పుడు కమిన్స్ అదే పంథాలో నడిచి చరిత్రలో నిలిచారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో టెంబా బవుమా తొలి ఇన్నింగ్స్‌లో 84 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అయితే, కమిన్స్ వేసిన బంతిని మార్నస్ లబుషేన్ అద్భుతంగా క్యాచ్ చేసి, బవుమాను పెవిలియన్‌కి పంపాడు.

రెండో రోజు లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 121/5 స్కోరుతో నిలిచింది. కైల్ వెర్రెయిన్ (11), డేవిడ్ బెడింగ్‌హామ్ (39)లు క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా ఇంకా 91 పరుగుల వెనుకబాటులో ఉంది. ఆసీస్ జట్టు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.