అబుదాబి: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి అసలు సిసలైన చాంపియన్ ఆటను ప్రదర్శించింది. మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో ఇక్కడి మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 57 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (79 నాటౌట్; 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రోహిత్ (35), హార్దిక్ పాండ్యా (30 నాటౌట్) అతడికి సహకరించారు. అనంతరం లక్ష్యఛేధనలో రాజస్తాన్ రాయల్స్ తేలిపోయింది.
జోస్ బట్లర్ (70; 44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటం వృథా అయింది. బట్లర్‌కు తోడుగా మరొక రాజస్తాన్ ప్లేయర్ క్రీజులో నిల్చోలేదు. జైశ్వాల్, సంజూ శాంసన్‌లు పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరగగా.. స్మిత్ (6), లామ్రోర్ (11), టామ్ కరన్ (11)లు తీవ్రంగా నిరుత్సాహపరిచారు. రాజస్తాన్ బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ బౌలింగ్ చేసిన ముంబై.. ఏ దశలోనూ మ్యాచ్‌పై పట్టు విడువలేదు. ముంబై బౌలర్లు బుమ్రా (4/20), బౌల్ట్ (2/26), ప్యాటిన్సన్ (2/19)లు చెలరేగడంతో రాజస్తాన్ మరో 11 బంతులు మిగిలుండగానే 136 పరుగులకే కుప్పకూలింది.