అబుదాబి: ఈ మ్యాచ్ చూశాకా అందరూ పాపం పంజాబ్.. అయ్యో కేఎల్ రాహుల్, మయంక్ పోరాటం దండగ చేశారు కదా అని అనుకోక మారరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 13లో భాగంగా శనివారం రసవత్తర పోరు జరిగింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్(కేకేఆర్)-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా ఐపీఎల్ ఫ్యాన్స్‌కు కావాల్సిన మజా లభించింది. నరాలు తెగే ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 2 పరుగులు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
కార్తీక్ సేన నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు కావాల్సిన తరుణంలో సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాక్స్‌వెల్, మన్‌దీప్ సింగ్ వంటి హిట్టర్లు క్రీజులో ఉన్నప్పటికీ నరైన్ తన అనుభవాన్నంతా రంగరించి సూపర్బ్‌గా బౌలింగ్ చేసి కేకేఆర్‌కు విజయాన్ని అందించాడు.
రాహుల్, మయాంక్‌ల అసాధారణ పోరాటం..
లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు మంచి ఆరంభమే లభించింది. సారథి రాహుల్‌తో కలిసి మయాంక్ చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అనవసరపు షాట్లు ఆడకుండా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో వీరిద్దరు అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడి తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత మయాంక్ (54)ను ప్రసీద్ కృష్ణ ఔట్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ జట్టును గెలిపించే బాధ్యతను గాని రాహుల్‌కు అండగా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. నికోలస్ పూరన్ (14), సిమ్రాన్ సింగ్(4), మన్‌దీప్ సింగ్(0) తీవ్రంగా నిరాశపరిచారు. అయితే జోరుమీదున్న రాహుల్(74)ను ప్రసీద్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఔట్ చేయడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే చివరి ఓవర్లో నరైన్ బౌలింగ్ మంచిగా చేయడం.. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచిన మ్యాక్స్‌వెల్ (10 నాటౌట్) ఘోరంగా ఫెయిలయ్యాడు. దీంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఇది కేకేఆర్‌కు నాల్గో విజయం కాగా, పంజాబ్‌కు ఆరో ఓటమి.
ఎన్నాళ్లకెన్నాళ్లకు కార్తీక్ ఆడాడు..
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (57; 47 బంతుల్లో 5 ఫోర్లు), దినేశ్ కార్తీక్(58; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఇన్నింగ్స్‌ను రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్‌లు ఆరంభించారు. కాగా, రాహుల్ త్రిపాఠి(4) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో త్రిపాఠిని షమీ బౌల్డ్ చేశాడు. అనంతరం నితీష్ రాణా(2) రనౌట్ అయ్యాడు. ఆపై ఇయాన్ మోర్గాన్-గిల్‌ల జోడి 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత మోర్గాన్(24) ఔటయ్యాడు. ఆ తరుణంలో గిల్‌కు -దినేశ్ కార్తీక్ జత కలిశాడు. ఈ జోడి 82 పరుగుల జోడించిన తర్వాత గిల్ ఔటయ్యాడు. దాంతో కేకేఆర్ తిరిగి తేరుకుంది. అటు తర్వాత కార్తీక్ అర్థ శతకం మార్కును చేరి బ్యాటింగ్‌లో సత్తాచాటి స్కోరు బోర్డును చక్కదిద్దాడు.