దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్‌లీగ్(ఐపీఎల్)-13లో తొలి హిట్ వికెట్ నమోదయింది. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎవరూ ఊహించనిరీతిలో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ సందర్బంగా 19వ ఓవర్ వేసిన ఆండ్రీ రస్సెల్ బౌలింగ్‌లో వికెట్ల మీదకు వస్తున్న బంతిని ఆఫ్ట్ స్టంప్ ఆడబోయిన హార్దిక అనూహ్య రీతిలో వికెట్లకు బ్యాట్‌ను తాకించాడు. దీంతో కొన్ని క్షణాల పాటు ఏం జరిగిందో తెలియక కేకేఆర్ ఆటగాళ్లతో పాటు హార్దిక్ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇక హిట్ వికెట్ అయిన హార్దిక్‌ను అతడి డైహార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ ఆటాడేసుకుంటున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో కేకేఆర్‌పై ఘన విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సారథి రోహిత్ శర్మ (80, 54 బంతుల్లో; 3×4, 6×6) అర్ధశతకంతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్ (47, 28 బంతుల్లో; 6×4, 1×6) రాణించడంతో ముంబై భారీ స్కోర్ సాధించింది. అనంతరం 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది. ఛేదనలో సారథి దినేశ్ కార్తీక్ (30) ఓ మోస్తారుగా రాణించినప్పటికీ మిగతా బ్యాట్స్‌మన్ ఘోరంగా విఫలమయ్యారు. ట్రెంట్ బౌల్ట్, ప్యాటిన్సన, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి కేకేఆర్‌ను కట్టడి చేశారు.