అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13లో డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. టోర్నీ ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చతికిలపడిన రోహిత్ సేన బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అసలుసిసలైన చాంపియన్ ఆటను ప్రదర్శించి సూపర్బ్ విక్టరీని అందుకుంది. అబుదాబి వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 49 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.
ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది. ఛేదనలో సారథి దినేశ్ కార్తీక్ (30) ఓ మోస్తారుగా రాణించినప్పటికీ మిగతా బ్యాట్స్‌మన్ ఘోరంగా విఫలమయ్యారు. ట్రెంట్ బౌల్ట్, ప్యాటిన్సన, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి కేకేఆర్‌ను కట్టడి చేశారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. సారథి రోహిత్ శర్మ (80, 54 బంతుల్లో; 3×4, 6×6) అర్ధశతకంతో చెలరేగడంతో కోల్‌కతా జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇన్నింగ్స్ ఆదిలోనే రోహిత్‌సేనకు ఎదురుదెబ్బ తగిలింది. డికాక్ (1)ను శివమ్ మావి (2/32) పెవిలియన్‌కు చేర్చి ముంబయికి షాక్ ఇచ్చాడు.
అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (47, 28 బంతుల్లో; 6×4, 1×6)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిస్తూ 90 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 11వ ఓవర్‌లో జట్టు స్కోరు 98 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ రనౌటయ్యాడు. తర్వాత సౌరభ్ (21, 13 బంతుల్లో; 1×4, 1×6)తో కలిసి హిట్‌మ్యాన్ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.